ఏపీలో ఏ వ్యవస్థా సక్రమంగా పని చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఎవరికి వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సి వస్తోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి జీతం రూ. పద్దెనిమిది వేలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇప్పటికి వారికి ఇస్తోంది పదిహేను వేలు మాత్రమే. తమ సమస్యల విషయంలో ఇంత కాలం ఓపిక పట్టిన వారు ఇప్పుడు రోడ్డెక్కారు. సమ్మె ప్రారంభించారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా చెత్తపన్నును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. ఈ ప్రకారం పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. చెత్త పన్ను ఇవ్వకపోతే చెత్త ఇంటి ముందు పోయ్యాలనే హెచ్చరికలు కూడా మంత్రుల స్థాయి నేతలు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులకే సరైన జీతాలు అందడం లేదు. దీంతో వారు సమ్మెకు దిగాల్సి వచ్చింది.
మళ్లీ అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని మంత్రులు చెబుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలా జీతాలు పెంచిందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం జీవన వ్యయం దారుణంగా పెరిగిపోయింది. పారిశుద్ధ్య కార్మికుల్లో మద్యం అలవాటున్న వారి కుటుంబాల్లో జీతం మొత్తం మద్యానికే సరిపోయే పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వారి గురించి ప్రభుత్వం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.