బాలకృష్ణ కెరీర్లో అఖండ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. అక్కడి నుంచే బాలయ్య గ్రాఫ్ మొత్తం మారిపోయింది. వరుసగా విజయాలు అందుకొంటూ వచ్చారు. బోయపాటి శ్రీనుకు కూడా అదే బిగ్గెస్ట్ హిట్. ఆ తరవాత చేసిన ‘స్కంద’ దారుణ పరాజయం పాలైంది. అందుకే ‘అఖండ 2’తో కమ్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఇవ్వాలనుకొంటున్నారు. దాని కోసం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటున్నారు.
‘అఖండ’ లో కనిపించిన పాత్రలే అఖండ 2లోనూ కంటిన్యూ అవుతున్నాయి. దానికి తోడు కొత్త పాత్రలు వచ్చి చేరుతున్నాయి. సంయుక్త మీనన్ ని ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి కూడా ఈ టీమ్ లోకి వచ్చి చేరారు. ‘సరైనోడు’లో ఆది పవర్ ఫుల్ విలన్‌గా కనిపించారు. దాంతో ఈ సినిమాలోనూ ఆయనే విలన్ అని ఫిక్సయిపోయారంతా. అయితే.. ఇప్పుడు విలన్ గా మరో పెద్ద పేరు వినిపిస్తోంది. సంజయ్ దత్ ని ఈ సినిమా కోసం చిత్రబృందం సంప్రదించిందని, ఆయన ఈ కథకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్‌దత్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే సంజూ స్క్రీన్ ప్రజెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. సంజూ చేతిలో ఓ పాత్ర పెడితే, దాన్ని ఆయన నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తారన్న నమ్మకం కలిగింది. అందుకే మరోసారి సంజూని తీసుకురావాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. బాలయ్య – సంజయ్ దత్ ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకొంటే… ఆ ఫైర్ వేరేలా ఉంటుంది. పైగా హిందీ మార్కెట్ కి కూడా ఉపయోగపడుతుంది. అందుకే మున్నాభాయ్ కోసం సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. త్వరలోనే అసలు విషయం బయటకు వస్తుంది.