బోయపాటి సినిమాల స్పెషల్ ఏమిటంటే – కథానాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే శక్తిమంతంగా ఉంటుంది. లెజెండ్‌లో జగపతిబాబు, సరైనోడులో ఆది పినిశెట్టి పాత్రలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడు బాలయ్య కోసం ఏకంగా సంజయ్ దత్‌నే దిగుమతి చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు బోయపాటి.
అయితే… సంజయ్ విషయంలో బోయపాటి కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… సంజయ్ దత్ అడుగుతున్న పారితోషికం మామూలుగా లేదట. ఇంచుమించుగా బాలయ్యకు ఇస్తున్న పారితోషికాన్నే డిమాండ్ చేస్తున్నాడట. పైగా డబ్బింగ్ చెప్పడు. ప్రచారానికి రాడు. షరతులు కూడా వేరే స్థాయిలో ఉంటాయి. అలాంటప్పుడు అంతంత పారితోషికాలెందుకు? అన్నది ప్రశ్న. పైగా.. హిందీ నటులతో వచ్చే ఇబ్బంది ఏమిటో బోయపాటికి బాగా తెలుసు. `వినయవిధేయరామా` కోసం బాలీవుడ్ నుంచి వివేక్ ఓబెరాయ్‌ని తీసుకొచ్చాడు. ఆ పాత్ర ప్లస్ అవుతుందనుకుంటే, అదే మైనస్ అయ్యింది. వివేక్ ఓబెరాయ్ వల్ల ఈ సినిమాని ఒరిగిందేం లేకుండా పోయింది. రేపు సంజయ్ దత్ విషయంలోనూ అదే జరిగితే…? కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఆ క్రేజ్ బాలయ్య సినిమాకీ ఉపయోగపడుతుందన్నది బోయపాటి ఉద్దేశం. కేజీఎఫ్ 2, బాలయ్య సినిమా దాదాపు ఒకే సీజన్లో వస్తాయి. కేజీఎఫ్ 2 హిట్టయి, అందులో సంజయ్ దత్ పాత్ర పేలితే – తనకు ప్లస్ అవుతుంది. అది జరక్కపోతే, ఆ సినిమానే తనకు మైనస్ అవుతుంది. ఇన్ని ఇబ్బందులున్నాయి.
జగపతిబాబు, ఆది పినిశెట్టి టైపులో ఓ విలన్ ని తయారు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు బోయపాటిపై ఉంది. రాజశేఖర్ లాంటివాళ్లని విలన్లు గా చూపిస్తే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. పైగా బాలయ్య – రాజశేఖర్ లకు ఈమధ్య దోస్తీ బాగానే కుదిరింది. ఆ దిశగా బోయపాటి ఆలోచించే అవకాశాలు లేకపోలేదు.