పాన్ ఇండియా అనే పదం ఎప్పుడైతే పుట్టిందో, అప్పుడే బాలీవుడ్ వాళ్లు సౌత్ లో ఆధిపత్యం చెలాయించడం మొదలెట్టారు. అక్కడి క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని, తెలుగు సినిమాల్లోకి దిగుమతి చేసుకోవాలన్న ఉత్సాహం మనవాళ్లకు మరింత ఎక్కువైంది. సంజయ్‌దత్ కూడా అలా దక్షిణాదిన అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నవాడే. ‘కేజీఎఫ్ 2’లో సంజూభాయ్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అంతేకాదు.. ప్రభాస్ – మారుతిల `రాజాసాబ్`లోనూ తనకు ఓ అత్యంత కీలకమైన పాత్ర దక్కింది. తెలుగు సినిమాల్లో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అయితే సంజూని భరించడం అంత సులభం ఏమీ కాదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘కేజీఎఫ్ 2’ కోసం సంజూ రూ.6 కోట్లు తీసుకొన్నాడు. అప్పటికి అది రీజనబుల్ రేటే. ఇస్మార్ట్ శంకర్ వరకూ వచ్చేసరికి మున్నాభాయ్ రెండు కోట్లు పెంచి రూ.8 కోట్లు అందుకొన్నాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం రౌండ్ ఫిగర్ రూ.10 కోట్ల మార్క్ చేరాడు. పది కోట్లూ ఒక ఎత్తయితే, మున్నాభాయ్ ఖర్చులు అదనంగా మరో రూ.2 కోట్ల వరకూ అవుతాయని టాక్. సంజయ్‌దత్‌కి స్పెషల్ గా ఓ క్యార్ వాన్ ఉంది. అది ముంబై నుంచి రావాలి. దాని రాను, పోనూ ఛార్జీలు, మెయింటినెన్స్ నిర్మాతలే భరించాలి. సంజూ టీమ్ లో మొత్తం ఎనిమిదిమంది. వాళ్ల జీత భత్యాలు, బేటాలు, వసతులు అన్నీ… నిర్మాతలే చూసుకోవాలి. మరీ ముఖ్యంగా సంజూ కోసం హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేయాలి. `రాజాసాబ్` కోసం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అందుకే పూరి తెలివిగా సంజూ ఎపిసోడ్లన్నీ ముంబైలో షూట్ చేసేశాడు. కాబట్టి, పూరికి కాస్త మినహాయింపు లభించింది. అయితే సంజూకి ఎంత ఖర్చు పెట్టినా వర్కవుట్ అయిపోతుందని నిర్మాతలు చెబుతున్నారు. సంజూ వల్ల బాలీవుడ్ మార్కెట్ మరింత ఓపెన్ అవుతుందని, దాని ముందు సంజూ పారితోషికం, అదనపు ఖర్చులు పెద్దగా లెక్కేసుకోవాల్సిన పనిలేదని అంటున్నారు. అందుకే సంజూ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది.