హైదరాబాద్: జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మీడియాకు ఒక అభ్యర్థన చేశారు. తనకు శిక్ష పడింది అక్రమంగా మారణాయుధాలు కలిగిఉన్న నేరానికని, ముంబాయి పేలుళ్ళతో తనకు సంబంధం లేదని, తనను తీవ్రవాదిగా చిత్రీకరించొద్దని దీనంగా అభ్యర్థించారు. ముంబాయిలని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తిరిగొచ్చిన తర్వాత దత్ మీడియాతో మాట్లాడారు. 23 ఏళ్ళుగా ఈ క్షణాలకోసమే వేచి చూశానని, తాను స్వేఛ్ఛాజీవినన్న ఫీలింగ్ ఇంకా లోపల సింక్ అవ్వలేదని చెప్పారు. నాలుగు రోజులుగా తిండి తినలేదని, నిన్న రాత్రి నిద్రపోలేదని తెలిపారు. స్వేఛ్ఛ లభించటం అద్భుతమైన ఫీలింగ్ అన్నారు. ఈ సమయంలో తన తండ్రిని బాగా మిస్ అవుతున్నట్లు చెప్పారు. భారత దేశ భూమిని తాను ప్రేమిస్తానని, భారతీయుడు అయినందుకు తాను గర్విస్తానని, అందుకే జైలు నుంచి బయటకు రాగానే నేలను ముద్దు పెట్టుకున్నానని, జైలుపైనున్న త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశానని తెలిపారు.
మాన్యత తనకు బెటర్ హాఫ్ కాదని, బెస్ట్ హాఫ్ అని దత్ అన్నారు. జైలులో తాను సంపాదించిన రు.440ను ఒక మంచి భర్త లాగా తన భార్యకు ఇచ్చేశానని చెప్పారు. ఇప్పుడు తన ప్రాధాన్యత అంతా కుటుంబంతో, పిల్లలతో గడపటమేనని అన్నారు. సల్మాన్ తన తమ్ముడులాంటివాడని, అతనంటే తనకు ఎంతో ప్రేమ అని, అతని సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నపుడు అతని సంతానమైన కవలపిల్లలు ఇద్దరూ అక్కడికి చేరుకోగా, దత్ వారిద్దరినీ ముద్దులాడారు. వారిద్దరిలో ఒకరు మగ కాగా మరొకరు ఆడపిల్ల.
దత్ ఇవాళ పూణే నుంచి ముంబాయి చేరుకోగానే, మొదట తన తల్లి సమాధిని సందర్శించుకున్నారు. తర్వాత సిద్ధి వినాయక దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్న తర్వాత ఇంటికి చేరుకున్నారు.