హైదరాబాద్: జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ త్వరలో స్వేచ్ఛా వాయువులు పీల్చబోతున్నారు. శిక్షాకాలం పూర్తికాకముందే బయటకు రాబోతున్నారు. సత్ప్రవర్తన కారణంగా అతనిని 103 రోజుల ముందే విడుదల చేయబోతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వనుండటంతో ఇది సాధ్యం కాబోతోందని తెలిసింది. ఫిబ్రవరి 27న ఆయన విడుదలయ్యే అవకాశాలున్నాయి. 1993లో ముంబాయిలో జరిగిన పేలుళ్ళ సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటానికి సంబంధించిన కేసులో దత్కు కోర్ట్ 2013లో ఐదేళ్ళ శిక్ష విధించింది. సుప్రీమ్ కోర్ట్ కూడా ఆ శిక్షను సమర్థించటంతో దత్ 2013నుంచి పూణే ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్ట్ శిక్ష ప్రకటించకముందు రిమాండ్ ఖైదీగా 18 నెలల శిక్షను దత్ అనుభవించారు. 56 ఏళ్ళ సంజయ్ దత్ విడుదలైన తర్వాత సినిమాలలో మళ్ళీ నటించనున్నారు.