హైదరాబాద్: మున్నాభాయ్ సంజయ్ దత్‌కు విముక్తి లభించింది. ఈ ఉదయం ఆయన పూణే ఎరవాడ జైలునుంచి విడుదలయ్యారు. ఆయన ముంబాయి బయలుదేరారు. భుజానికి బ్యాగ్, చేతిలో ఫైళ్ళు పట్టుకునిఉన్న దత్, జైలు గేటు నుంచి బయటకు రాగానే అక్కడ నేలను ముద్దాడారు. తర్వాత వెనక్కు తిరిగి జైలు భవనానికి సెల్యూట్ చేశారు. జైలు వద్ద దత్‌కు ఆయన భార్య మాన్యత, పిల్లలు, దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని స్వాగతం పలికారు. అక్కడనుంచి వారు కారులో పూణే విమానాశ్రయానికి చేరుకుని ఛార్టర్డ్ ఫ్లైట్‌లో ముంబాయి బయలుదేరారు. ముంబైలో దిగగానే దత్ ప్రసిద్ధి చెందిన సిద్దివినాయక్ ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకుంటారని, అక్కడనుంచి తన తల్లి సమాధి దగ్గరకు వెళ్ళి నివాళులర్పిస్తారని తెలుస్తోంది.
పూణే విమానాశ్రయంలో దత్ మీడియాతో మాట్లాడుతూ, “వారి మద్దతువలనే ఇది సాధ్యమయింది, స్వేచ్ఛ ఈజీగా లభించలేదు” అని అన్నారు. వారు అంటే ఆయన ఉద్దేశ్యం అభిమానులని అయిఉండొచ్చు. 1993 ముంబాయి పేలుళ్ళకు సంబంధించిన ఆయుధాల కేసులో దోషిగా నిర్ధారణ కావటంతో 5 సంవత్సరాల శిక్ష పడింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా అతని శిక్షను తగ్గించింది. దత్ మొత్తం 42 నెలలు జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆయనను ముందుగా విడుదల చేయటం అక్రమమంటూ ఒక పిల్ దాఖలవటం విశేషం.
స్వేచ్ఛాజీవిగా మారిన సంజయ్ ఇప్పుడు మున్నాభాయ్ మూడోభాగంతో సహా ఆరు సినిమాలలో నటించబోతున్నారు. మరోవైపు మున్నాభాయ్ సిరీస్‌లోని రెండు చిత్రాలకు కథనందించిన రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తీస్తున్నారు. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రను పోషించనున్నారు.