హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు అక్రమ ఆస్తుల విలువ ఎట్టకేలకు తేలింది. ఇది మొత్తం రు.300 కోట్లపైనే ఉంటుందని అనధికారిక అంచనా. ఈ కేసులో తవ్వేకొద్దీ అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. సంజీవరావు, అతని బినామీల పేరిట మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలలో 200 ఎకరాలకు పైగా భూమలున్నట్లు తేలింది. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఖరీదైన ప్రాంతాలలో విలాసవంతమైన భవనాలు, షాపింగ్ సముదాయాలున్నాయి. 18 బ్యాంక్ ఖాతాలు, 10 లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. తిరుమలగిరి యాక్సిస్ బ్యాంక్ లాకర్లో రు.70 లక్షల విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, వడ్డాణాలు కనిపించటంతో ఏసీబీ అధికారులే విస్తుపోయారు. గతంలో కుమార్తె పెళ్ళికి ఈయన రు.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. అన్నట్లు టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు ఈయన వియ్యంకుడేనట.
ఇదిలా ఉంటే, కరీంనగర్లో ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం మోహన్ రెడ్డి ఆస్తుల విలువ రు.100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. అతనివద్ద తనఖా పెట్టిన ఆస్తులే రు.50 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. హుస్నాబాద్, చిగురుమామిడి, చొప్పదండితో పాటు జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. ఇవికాకుండా కరీంనగర్లో పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలనుకూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో అప్పులు తీసుకున్నవారు ఇచ్చిన 34 బ్లాంక్ చెక్లు, 39 ప్రామిసరీ నోట్లు, 46 అగ్రిమెంట్ సేల్ డీడ్స్, 42 పహణీ పత్రాలు, 49 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లతో పాటు మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి వందలాది దస్తావేజులు, ఒప్పంద పత్రాలు ఉన్నాయి. ఇవికాకుండా మరో వందకు పైగా డాక్యుమెంట్లు మోహన్ రెడ్డి అకౌంటెంట్ జ్ఞానేశ్వర్ వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ జ్ఞానేశ్వర్, సీఐడీ కానిస్టేబుల్ పరుశురాం, పంకజ్ సింగ్ అనే మరోవ్యక్తి ఈ కేసులో కీలకంగా మారారు. వీరు పరారీలో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో కనీసం పదిమంది పోలీస్ అధికారులు మోహన్ రెడ్డికి ఫైనాన్స్ దందాలో సహకరించారని చెబుతున్నారు. వీరిలో కొందరిపై వేటు పడగా, మరికొందరిపై వేటు పడనుంది. వీరిలో చాలామంది పోలీస్ ఉన్నతాధికారులు తమ అక్రమ సంపాదనను మోహన్ రెడ్డి ద్వారా వడ్డీలకు తిప్పుతున్నట్లు బయటపడింది.