ధోనీ రిటైర్మెంట్ తరవాత.. ఆస్థానంలో ఎవరొస్తారు? ధోనీని భర్తీ చేసే సత్తా ఎవరికి ఉంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా కనిపించాడు పంత్. వరల్డ్ కప్‌లో సైతం రెండో వికెట్ కీపర్ గా స్థానం సంపాదించాడు. దూకుడైన ఆటతో పంత్ కొన్ని మ్యాచ్‌లలో ఆకట్టుకున్నాడు. గత ఐపీఎల్ లో విజృంభించిన పంత్ పై.. భారత క్రికెట్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే… అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో పంత్ పై భారం ఎక్కువైంది. ఇటీవల పెద్దగా రాణించలేదు. వరల్డ్ కప్ లో కీలకమైన సమయాల్లో పేలవమైన షాట్లతో తనకు తానుగా వికెట్లు సమర్పించుకున్నాడు. కానీ.. పంత్ ని మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో తననే కీపర్ గా కొనసాగించాల్సివచ్చింది.
అయితే.. ఇప్పుడు పంత్ కి పోటీగా సంజూ శాంసన్ రేసులోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్ లో.. సంజూ ఆట ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ తరపున అద్భుతంగా ఆడి.. మరోసారి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు. 34 బంతుల్లో 9 సిక్స్‌ల సహాయంతో 74 పరుగులు చేశాడు. నిలబడిన చోట నుంచే.. సిక్స్‌లు కొట్టి – అదరహో అనిపించాడు. సంజూ బ్యాటింగ్ చూస్తే.. భారతజట్టుకు ఓ మంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దొరికినట్టే అనిపించింది. గతంలోనూ సంజూకి ఒకట్రెండు అవకాశాలు వచ్చాయి. తకానీ తనని తాను నిరూపించుకునే ఛాన్సులే రాలేదు. అయితే ఈసారి మాత్రం పంత్ కి బదులుగా తన పేరు పరిశీలించొచ్చన్న భరోసాని కలిగించాడు. వికెట్ల వెనుక కూడా చాలా చురుగ్గా స్పందించాడు. రెండు క్యాచ్‌లు పట్టుకోవడంతో పాటు, రెండు స్టంపౌట్లు చేశాడు. ఇప్పుడు ఒత్తిడి అంతా పంత్ పైనే. ఈ ఐపీఎల్లో పంత్ రాణించకపోతే – తన స్థానంలో సంజూ దూసుకొచ్చే అవాకాశాలు పుష్కలంగా ఉన్నాయి.