సంజూ.. సంజూ.. సంజూ..
బాలీవుడ్ అంతా ఈ సినిమా పేరే.
హిరాణీ అద్భుతంగా తీశాడు, సంజయ్ దత్‌గా రణబీర్ కపూర్ ఇరగదీశాడు అని చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజమే. హిరాణీ తానెందుకు గొప్ప దర్శకుడో ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. స్వయంగా సంజయ్ దత్ నటించినా.. ఇలా ఉండదేమో అన్నంత గొప్పగా రణబీర్ ఆ పాత్రలో ఇమిడిపోయాడు. వినోదం, భావోద్వేగాలు, గుండెల్ని పిండేసే గాయాలు, కన్నీరు పెట్టించే సందర్భాలు, ఇంటికెళ్లి కూడా గుర్తు చేసుకునే సన్నివేశాలు… ఇలా చాలా చాలా ఉన్నాయ్ ఈ సినిమాలో. వంద కోట్లు, రెండొందల కోట్ల మైలురాళ్లని ఈ సినిమా అవలీలగా దాటేస్తే.. రేపో మాపో హిరాణీకీ, రణబీర్‌కి బోలెడన్ని అవార్డులు వచ్చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటే లోపం. ఒక్కటే.. అసంతృప్తి. హిరాణీ నిజాలు చెప్పలేదే..? అబద్దాల్ని, మోసాల్ని, అన్యాయాన్ని కూడా అందంగా ప్యాక్ చేసి చూపించాడే అన్న లోపం.
సంజయ్ దత్ సినిమాల్లోనే హీరో. బయట కాదు. తన చుట్టూ ఎన్నో కోణాలు. అమ్మాయిల్ని వాడుకుంటాడని, డ్రగ్స్‌కి బానిస అని, దేశ ద్రోహానికి పాల్పడ్డాడని ఇలా ఎన్నో అభియోగాలు సంజయ్‌దత్‌పై ఉన్నాయి. అమ్మాయిల్ని వాడుకోవడం, డ్రగ్స్‌ని బానిస అవ్వడం నిజమని… బయోపిక్‌లోనూ చూపించారు. కానీ… అందంగా, ‘అరె.. అదంత తప్పు కాదేమో’ అన్నంత భ్రమించేలా ఆ సీన్లు డిజైన్ చేశాడు. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్టు తీయాలి. తప్పొప్పుల్ని సమానంగా తూకం వేయగలగాలి. తప్పుల్ని గ్లోరిఫై చేస్తూ… ‘తప్పని పరిస్థితుల్లో చేశాడేమో’ అనేలా తీయకూడదు. హిరాణీ చేసింది అదే. ఈ సినిమా చూస్తుంటే.. ‘నేను మంచివాడ్ని సుమా’ అంటూ సంజయ్ దత్ చెప్పుకోవడానికి హిరాణీ ఓ వేదిక కల్పించినట్టు అనిపిస్తుంది. సంజూ చెప్పింది చెప్పినట్టు, తూ.చ తప్పకుండా ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది. ‘నా కథ ఇలానే తీయాలి.. ‘ అని హిరాణీ పక్కన నిలబడి సంజూ ఈ సినిమా తీయించుకున్నాడేమో అన్న అనుమానం వేస్తుంది. నిజంగా ఇది సంజూ ఆత్మకథ కాకపోతే, కథకుడిగా హిరాణీ మరోసారి మనసుల్ని గెలుచుకునేవాడు.
కానీ ఇది ఆత్మకథ ఆయె. సంజూలోని లోపాలు జనాలకు తెలుసు. న్యాయస్థానాలకు తెలుసు. వాటిని సైతం ఈ సినిమాలో కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. `సంజూ కథ కాదులే` అని సినిమా చూస్తే… త్రీ ఈడియట్స్ కంటే ఈ సినిమా గొప్పగా మిగిలిపోయేది. కాకపోతే.. ఆత్మకథ అయిపోయింది. చేసిన తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం సంజూకి ఉండి ఉంటే, `పర్లేదు భాయ్… నా లోపాలు కూడా చూపించు` అని చెప్పగలిగి,… హిరాణీకి స్వేచ్ఛ ఇస్తే.. ‘బయోపిక్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా ఈ సినిమా ఉండేదేమో. చరిత్రలో మిగిలిపోవాల్సిన ఓ క్లాసిక్.. ‘మన డబ్బులకు సరిపడా వినోదం గిట్టుబాటైంది’ అనుకునే రెగ్యులర్ కమర్సియల్ సినిమాగా మారకపోదును.