శంకర ఇప్పటి సినిమా కాదు. రాత పరంగా… ఆఖరికి తీత పరంగానూ. నాలుగేళ్లకు ముందే మొదలైంది. కానీ చాలా సమస్యలు పట్టిపీడించడంతో విడుదల నానా యాతన పడింది. చివరికి ఏదోలా విడుదలైంది. కొన్ని సినిమాలు ఆలస్యంగా వచ్చినా… ఆకర్షణ తగ్గదు. శంకరలో ఉన్న ఆకర్షణ. ఇది మౌనగురు సినిమాకి రీమేక్. దానికి తోడు మురుగదాస్ లాంటి ఇంటిలిజెంట్ దర్శకుడి కలం నుంచి వచ్చిన కథ. ఇవి రెండూ చాలు.. `శంకర` ఎలా ఉందో అంటూ ఓ లుక్కు వేయడానికి. పైగా రోహిత్ ఇటీవలే జ్యో అత్యుతానంతతో హిట్టు కొట్టాడు. అందుకే.. ‘శంకర’పై ఎంతకాదన్నా.. ఎంతో కొంత అటెన్షన్ పడింది. మరి ఈసినిమా ఎలా ఉంది? మౌన గురులా.. సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టే లక్షణాలు ఉన్నాయా? చూద్దాం.. పదండి.
* కథ
అతనో పరమ దుర్మార్గుడైన ఏసీపీ (జాన్ విజయ్). డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కళ్ల ముందు ఓ యాక్సిడెంట్ జరిగితే… రూ.15 కోట్ల కోసం ఓ నిండు ప్రాణం బలి తీసుకొని… ఆ డబ్బుని కాజేయాలనుకొంటాడు. ఇదే అదునుగా.. గుర్తు తెలియని వ్యక్తి ఏసీపీని ఫోన్లో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెడతాడు. అతని దగ్గర్నుంచి వీడియో ఫుటేజ్ దక్కించుకోవడానికి తప్పు మీద తప్పు చేసుకొంటూ వెళ్తాడు ఏసీపీ. అందులో… ఈ కేసుతో, ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని శంకర (నారా రోహిత్) అనే ఓ కాలేజీ స్టూడెంట్‌ని ఇరికించి… అతనిపై పిచ్చివాడన్న ముద్ర వేస్తారు. అందులోంచి శంకర ఎలా బయటపడ్డాడు? దుర్మార్గుల్ని ఎలా శిక్షించాడు? అనేదే కథ.
* ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్
నారా రోహిత్ సీరియస్ డైలాగుల్ని సిన్సియర్‌గా చెప్పగలడు. ఇంటెన్సిటీ ఉన్న సన్నివేశాలు అతనిపై బాగా వర్కవుట్ అవుతాయి. అందుకనే… ఈ కథ తన దగ్గరకు వెళ్లిందేమో? నాలుగేళ్ల క్రితం సినిమాకాబట్టి.. అప్పటి యంగ్ లుక్ అతనికి కలిసొచ్చింది. ఇప్పటితో పోలిస్తే.. కాస్త చూడగలిగాం. అయితే.. ఎమోషన్ సీన్స్ మినహాయిస్తే మిగిలిన చోట్ల తేలిపోతున్నాడు. రొమాన్స్, కామెడీ.. ఇవేం రోహిత్ నుంచి ఆశించలేం. అదృష్టవశాత్తూ ఈ కథలోనూ వాటికి చోటు లేదు. రెజీనా చాలా బక్కగా కనిపించింది. ఆమె పాత్ర నుంచి ఎక్కువ ఆశించకూడదు కూడా. విలన్ పాత్రధారి నటనలో అతి ఎక్కువగా కనిపించింది. రాజీవ్ కనకాల మరోసారి మెప్పిస్తాడు. ఎమ్మెస్, ధన్‌రాజ్‌లు ఉన్నా.. నవ్వులు రాలేదు.
* టెక్నికల్ పెర్‌ఫార్మ్సెన్స్
మౌనగురు కథలో ఎలాంటి లోపం లేదు. గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ఈ కథలో చాలా ఉన్నాయి. అయితే దర్శకుడు వాటిని మలిచిన విధానం ఆకట్టుకోదు. శంకర స్క్రీన్ ప్లేలోని ఓ చిన్న దోషం కనిపిస్తుంది. కథానాయకుడి చుట్టూ జరుగుతున్నదంతా ప్రేక్షకుడికి ముందే తెలుసు. తెలియంది హీరోకి, అతని చుట్టు పక్కల వాళ్లకి. ఆడియన్‌కి కథలో ముడి ఎప్పుడు విడిపోయిందో అప్పుడు ఆసక్తి తగ్గిపోతుంది. మరి ఇదే స్క్రీన్‌ప్లేతో తమిళంలో మెప్పించగలిగినప్పుడు.. తెలుగులో వర్కవుట్ కాలేదంటే అదంతా దర్శకత్వంలోని లోపమే. సాయికార్తీక్ పాటలు ఇలానే సాగితే అతన్ని అతి తొందర్లో మర్చిపోతామేమో? నేపథ్య సంగీతంలో సాయి మార్క్ ఈ సినిమాలో మాత్రం కనిపించలేదు. సినిమాని ట్రిమ్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ కట్ చేసుకొంటూ వెళ్లారేమో. అందుకే ఎడిటింగ్ జంప్‌లో కనిపిస్తాయి.
- * హైలెట్స్
మూల కథ
ఇంట్రవెల్ సీన్లు
ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్టు - * డ్రా బ్యాక్స్
కథనం
స్పీడ్ తగ్గడం
రిలీఫ్ పాయింట్లు లేకపోవడం
* ఎనాలసిస్
మౌనగురు మూలకథలో విషయం ఉంది. తమిళంలో దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంటుంది. అయితే అదే స్క్రీన్ ప్లే ట్రిక్ ఇక్కడ మాత్రం వికటించింది. మన దగ్గర సినిమా కాస్త స్లో అయినా తట్టుకోలేం. సందేశాలు ఇవ్వడం, విలన్ని బలహీనుడిగా చూపించడం వర్కవుట్ కావు. అయితే.. శంకరలో అవే ఎక్కువగా కనిపిస్తాయి. సెకండాఫ్ సినిమా ఒకే చోట స్ట్రక్ అయిపోతుంది. నాలుగేళ్ల క్రితం నాటి సినిమా కావడంతో.. తీత కూడా అప్పటిదే అనిపిస్తుంది. టేకింగ్ పరంగా క్వాలిటీ కనిపించలేదు. స్క్రీన్ ప్లేలో వేగం లేదు. మౌన గురుకి తన వంతు మార్పులు చేర్పులూ చేయలేకపోయాడు. ఉన్నది ఉన్నట్టుగా తీయడం వైపే దృష్టి పెట్టాడు. ఇదే కథని మురుగదాస్ `అకీరా`గా మలచుకొన్నాడు. లేడీ ఓరియెంటెడ్‌గా ఈ కథని మలచడంతో కొత్తగా కనిపించింది. మరీ అంత డ్రాస్టిక్ ఛేంజెస్ కాకపోయినా తాతినేని సత్య కాస్తో కూస్తో తన బుర్రకు కూడా పదునెట్టాల్సింది.
* రిజల్ట్: గరళాన్ని కంఠంలో దాచుకొని శంకరుడు దేవుడయ్యాడు. ఆలస్యమనే విషాన్ని దాచుకోలేని ఈ శంకర మాత్రం.. బాక్సాఫీసు ముందు చతికిలపడ్డాడు.
తెలుగు360 రేటింగ్ : 1.5/5