ప్రతీ యేటా సంక్రాంతికి బాక్సాఫీసు హోరెత్తిపోతుంటుంది. ఈసారి కరోనా వల్ల… ఆ హంగామా చూడలేం అనుకున్నారంతా. కానీ.. 4 సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడడానికి రెడీ అయ్యాయి. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్.. ఈ నాలుగు సినిమాలకూ మంచి బజ్ వుంది. మరి ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికి? ఈ సంక్రాంతికి అసలు సిసలు సినిమా ఏది?
క్రాక్… పక్కా కమర్షియల్ సినిమా. ట్రైలర్ చూస్తేనే ఈ సంగతి అర్థమైపోతోంది. రవితేజ పోలీస్ పాత్రల్లో విశ్వరూపం చూపిస్తుంటాడు. తనకు టేలర్ మేడ్ క్యారెక్టర్ ఇది. పాటలు ఇప్పటికే మాస్ కి ఎక్కేశాయి. పైగా.. సంక్రాంతికి కాస్త ముందే … అంటే 9న విడుదలైపోతోంది. క్రాక్ కి పోటీ లేదు. ఓ రకంగా సోలో రీలీజ్. మిగిలిన సినిమాలు విడుదలయ్యేలోగా… క్యాష్ చేసేసుకుంటుంది. కాబట్టి.. ఎక్కువ అడ్వాంటేజ్ క్రాక్‌కే ఉండొచ్చు.
అల్లుడు అదుర్స్ పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అనిపిస్తోంది. ట్రైలర్ రొటీన్ గానే ఉన్నా – ఫన్, యాక్షన్.. కావల్సినంత దట్టించారన్న విషయం అర్థం అవుతోంది. ఇవి రెండూ వర్కవుట్ అయితే.. అల్లుడు ఆకట్టుకోవొచ్చు. సంక్రాంతి సీజన్ చివర్లో, అంటే 15న విడుదల అవ్వడం.. కాస్త డిజ్ అడ్వాంటేజ్. అంతకు ముందు విడుదలైన మూడు సినిమాల్లో ఏది క్లిక్ అయినా.. అల్లుడిపై భారం పెరిగిపోతుంది. అలాంటప్పుడు రొటీన్ ముద్ర పడితే మొదటికే మోసం వస్తుంది.
రెడ్ పై అందరి దృష్టీ పడింది. `ఇస్మార్ట్ శంకర్` తరవాత రామ్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి.. అంచనాలు భారీగానే ఉంటాయి. పైగా ఇది రీమేక్ కథ. మినిమం గ్యారెంటీ ఉంటుంది. ట్రైలర్ ఆకట్టుకుంది. రామ్ బాడీ లాంగ్వేజ్.. ఇస్మార్ట్ శంకర్ ని గుర్తు చేస్తోంది. ఓరకంగా అది ప్లస్ అవ్వొచ్చు. ఓరకంగా మైనస్ కూడా అవ్వొచ్చు. కాకపోతే.. ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం.
ఈ మూడు సినిమాలతో పాటు.. డబ్బింగ్ బొమ్మ `మాస్టర్` కూడా వస్తోంది. సంక్రాంతి సీజన్ కావడం.. విజయ్‌కి కలిసొస్తుంది. పైగా.. `ఖైదీ` మనవాళ్లకు బాగా ఎక్కేసింది. ఆ దర్శకుడి సినిమా కావడం ప్లస్ పాయింట్. కాకపోతే మూడు తెలుగు సినిమాల మధ్య `మాస్టర్` నలిగిపోవొచ్చు.
అయితే స్టార్ హీరో సినిమా ఏదీ.. ఈ సీజన్లో రాకపోవడం.. ఈ నాలుగు సినిమాలకూ ప్లస్సే. వకీల్ సాబ్ లాంటి సినిమా వస్తే.. దాని ప్రభావం ఈ నాలుగు సినిమాలపై పడేది. వకీల్ సాబ్ ఉంటే.. వీటిలో ఒకట్రెండు సినిమాలు డ్రాప్ అయ్యేవి. పవన్ బరిలో లేకపోవడం.. ఈ సంక్రాంతి సినిమాలకు అతి పెద్ద ప్లస్.