గత సంక్రాంతికి.. వంద కోట్ల పోస్టర్లు రెండు చూసే అవకాశం వచ్చింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. రెండూ కలక్షన్ల మోత మోగించాయి. తెలుగు సినీ చరిత్రలో… అదే అత్యంత విజయవంతమైన సంక్రాంతిగా ట్రేడ్ వర్గాలూ విశ్లేషించేశాయి.
ఈ సంక్రాంతికి మాత్రం.. ఆ వసూళ్ల గలగలలు, వందకోట్ల పోస్టర్లూ కనిపించలేదు. కనిపించవు కూడా. ఎందుకంటే.. ఈ దఫా.. స్టార్ హీరో బరిలో లేడు. నాలుగు సినిమాలొచ్చినా… ప్రేక్షకుల ఓటు మాత్రం `క్రాక్` కే పడింది. పైగా క్రాక్… తొలి రోజు మార్నింగ్షో, మాట్నీ..లు రద్దయ్యాయి. కొన్ని చోట్ల ఫస్ట్ షో కూడా పడలేదు. దాంతో.. ఫస్ట్ డే వసూళ్ల హంగామా ని చూడలేకపోయింది. మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్.. వీటిలో ఏది సరిగా నిలబడే సినిమా కాదు. అయితే.. సంక్రాంతికి సినిమా థియేటర్లన్నీ కళకళలాడిపోతుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా.. జనాలు టికెట్ల కోసంక్యూలో ఉంటారు. `ఫర్వాలేదు` అనిపించుకున్న సినిమా కూడా.. మంచి వసూళ్లనే తెచ్చుకుంటుంది. అయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన.. వసూళ్లకు దారుణంగా గండి కొట్టింది. సగం టికెట్లే అమ్మాల్సిరావడంతో రెవిన్యూ ఆ మేరకు పడిపోయింది. జనాలు సినిమా చూడ్డానికి సిద్ధంగానే ఉన్నా, టికెట్లు లేవు. సంక్రాంతి మూడ్ అంతా వెళ్లిపోయాక.. అప్పుడు ఆ సగం కూడా నిండే ఛాన్సు లేదు. నిజానికి 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే గనుక… క్రాక్, మాస్టర్ సినిమాలకు మరింత మంచి వసూళ్లు వచ్చేవి. గత కొన్ని నెలలుగా… థియేటర్లు లేక, అందులో సినిమాలు లేక బోసిబోయిన… ఇండ్రస్ట్రీకి కాస్త ఉపశమనం లభించేది. కాకపోతే.. `క్రాక్` లాంటి మంచి మాస్ హిట్టు ఈ సంక్రాంతికి పడడం, జనాలు.. థియేటర్లకు రావడానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్లలో కరోనా భయాలు లేవు.. అనే సంకేతాలు దొరకడంతో చిత్రసీమ కాస్త ఊపిరి పీల్చుకుంది.