రైతుల ఇంటికి ధాన్యపు సిరులు వచ్చే పండుగ సంక్రాంతి. వ్యవసాయం మీదనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగకు ఉన్న శోభ వేరు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉండే సంక్రాంతి శోభ వేరు. ఇప్పుడు ప్రపంచం మారుతోంది. వ్యవసాయం మాత్రమే కాకుండా ఇప్పుడు అనేక విధాలుగా ఆర్థికంగా కుటుంబాలు బలపడుతున్నాయి. అందుకే క్రమంగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధానం కూడా మారుతూ వస్తోంది. ఇప్పుడు వ్యవసాయంతో సంబంధం ఉన్న కుటుంబాలు పరిమితంగానే ఉన్నాయి.
మారుతున్న జీవన శైలితో పండుగలు అంటే కూడా అర్థం మారిపోతూ వస్తుంది. కానీ పండగ ఆనందాల్లో మాత్రం మార్పు ఉండదు తెలుగు వారికి అతిపెద్ద పండగ సంక్రాంతి. ఏ పండుగను కుటుంబసభ్యులందరితో చేసుకోకోయినా సంక్రాంతిని మాత్రం కలిసి జరుపుకోవాలనుకుంటారు. కుటుంబం అంటే బంధువులే కాదు పుట్టిన ఊరు నిండా ఉండే మిత్రులు,పరిచితులు అందరూ కుటుంబసభ్యులే. వారితో కలిసి గడపడం … జ్ఞాపకాల్లోకి వెళ్లడం కూడా సంక్రాంతి పండగ స్పెషలే.
పండగ అంటే కొంత మంది జూదం అనుకుంటున్నారు. అందుకే పండగ సంబరాలు అంటే అవేనని మీడియా ప్రచారం చేస్తోంది. కానీ పండగలో కోడి పందేలు ఓ సరదా మాత్రమే. కానీ అలాంటి మంచి చెప్పేవారు లేరు . అందుకే అవే పండుగగా మారుతున్నాయి. అయితే మార్పును ఆహ్వానించాల్సిందే. పదేళ్ల కిందట ఇలా పండుగ చేసుకున్నాం. .. ఇప్పుడు ఇలా మారిపోయిందని బాధపడటం అనవసరం.
పండుగకు అసలైన అర్థం .. కుటుంబం, మిత్రులతో ఆనందంగా గడపడం. అది ఒక్క సంక్రాంతికే సాధ్యమవుతుంది.
తెలుగు 360 పాఠకులు అందరికీ హ్యాపీ సంక్రాంతి.