బాక్సాఫీసు దగ్గర సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. 10న గేమ్ చేంజర్, 12న డాకూ మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడింటితో సినిమా సంక్రాంతి పరిపూర్ణమైంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వచ్చిన `గేమ్ చేంజర్` అన్ని విధాల ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. మెగా ఫ్యాన్స్ ని కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో విషయం లేదని రివ్యూలు తేల్చేశాయి. వసూళ్లూ అంతే దారుణంగా ఉన్నాయి. తొలి రోజు టాక్ రాగానే – సినిమా ఫలితం అర్థమైపోయింది. చాలా చోట్ల ‘గేమ్ చేంజర్’ సినిమా తీసేసి… ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు థియేటర్లు ఇచ్చారు. సంక్రాంతి సీజన్ కాబట్టి కనీసం ఫస్ట్ షో, సెకండ్ షోలకు టికెట్లు తెగుతున్నాయి. సీజన్ అయితే థియేటర్లు ఖాళీ అవ్వడం ఖాయం.
12న వచ్చిన ‘డాకూ మహారాజ్’ బాలయ్య ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తోంది. కొత్త కథ కాకపోయినా, కొత్త తరహా స్క్రీన్ ప్లే కాకపోయినా, బాలయ్యని స్టైలీష్‌గా చూపించిన విధానం అందరినీ ఆకట్టుకొంది. పైగా విడుదలకు ముందు నుంచీ ఈ సినిమాకు పాజిటీవ్ బజ్ వుంది. అది బాగా హెల్ప్ అయ్యింది. దానికి తోడు ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. అక్కడక్కడ మార్నింగ్ షోలకు జనం పలచగా ఉంటున్నారు. కానీ ఫస్ట్ షో, సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. సంక్రాంతి సినిమాల్లో లాంగ్ రన్‌కు ఛాన్స్వున్న సినిమా ఇది. సంక్రాంతి సీన్ అయ్యాక అసలైన స్టామినా బయట పడుతుంది.
14న సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకీ టైమింగ్, ఫ్యామిలీ సినిమా అనే ముద్ర, గోదారి గట్టుమీద పాట.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఫస్టాఫ్‌ని బాగా ఈజీగా హ్యాండిల్ చేయగలిగిన అనిల్ రావిపూడి సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికి తేలిపోయాడు. కిడ్నాప్ డ్రామా రక్తికట్టకపోవడం అతి పెద్ద మైనస్. ఈ సినిమా విడుదలకు ముందు క్రింజ్ కామెడీ అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. క్రింజ్ కామెడీ కాదు. అలాగని థియేటర్ నుంచి బయటకు వచ్చి గుర్తు చేసుకొని మరీ నవ్వుకొనే సీన్లయితే లేవు. జస్ట్ టైమ్ పాస్ సినిమా. కాకపోతే.. ఈ సంక్రాంతి సినిమాల్లో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సినిమా ఇది. కాబట్టి..పండగ సీజన్‌ని బాగా క్యాష్ చేసుకోగలుగుతుంది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా, లేదా అనేది అనుమానమే. సంక్రాంతి సీజన్ ముగిశాకే దీని జాతకాన్ని అంచనా వేయొచ్చు.