ఈ సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి. మూడు సినిమాల ప్రమోషన్లు జోరందుకొన్నాయి. మూడు సినిమాల ట్రైలర్లూ వచ్చేశాయ్. ఇప్పుడు ఏది బెస్ట్..? అనే చర్చ మొదలవ్వడం సహజం. ట్రైలర్ రీచ్‌ని బట్టి, సినిమా జయాపజయాలు అంచనా వేస్తారు కాబట్టి, ఈ మూడు ట్రైలర్ల గురించి హాట్ హాట్ చర్చ నడుస్తోందిప్పుడు.
గేమ్ ఛేంజర్
మూడు సినిమాల్లో ముందుగా వస్తోంది ‘గేమ్ ఛేంజర్’. ముందుగా బయటకు వచ్చిన ట్రైలర్ కూడా ఇదే. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. శంకర్ మార్క్ ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. విజువల్స్ బాగున్నాయి. చరణ్ లుక్ అదిరింది. కొన్ని షాట్స్.. నిజంగా వెండి తెరరపై చూస్తే విజిల్స్ వేసేలా కనిపిస్తున్నాయి. తమన్ బీజియమ్స్కి మంచి మార్కులు పడుతున్నాయి. నిజానికి ‘గేమ్ ఛేంజర్’పై కాస్త తక్కువ నమ్మకాలున్నాయి. ఆ నమ్మకాలకు మించి.. ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. `ఈమాత్రం కూడా ఉంటుందని అనుకోలేదు` అనే కామెంట్లు వాళ్ల దగ్గర్నుంచి వినిపిస్తున్నాయి.
డాకూ మహారాజ్
ఈ సంక్రాంతి సినిమాల్లో ష్యూర్ షాట్ హిట్ అనే ఇమేజ్ తెచ్చుకొన్న సినిమా ‘డాకూ మహారాజ్’. టీజర్ తో అభిమానుల అంచనాలు ఆకాశానికి తాకాయి. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచం సృష్టించాడు బాబీ. బాలయ్య గెటప్ కూడా ఫ్యాన్స్‌కు నచ్చింది. ట్రైలర్లో బాలయ్య పాత్రల్లోని వేరియేషన్స్ బాగా చూపించారు. స్టైలీష్‌గా కట్ చేసిన ట్రైలర్ ఇది. సాధారణంగా బాలకృష్ణ ట్రైలర్ అనగానే పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. ఈసారి వాటి జోలికి పోలేదు. అయినా సరే, హీరోయిజం ఏమాత్రం తగ్గలేదు. ‘ట్రైలర్ లో పెద్దగా డైలాగులు లేవు. బాలయ్య నుంచి గుర్తు పెట్టుకొనే డైలాగులేం రాలేదు’ అనే కంప్లైంట్ ఉన్న మాట వాస్తవం. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ కూడా ఒప్పుకొన్నారు. బాలయ్యని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఇది భాగమని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ట్రైలర్ డాకూ మహారాజ్‌పై ఉన్న అంచనాల్ని పెంచలేదు.. అలాగని తగ్గించనూ లేదు.
సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటే ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయన మేనరిజం, ఫస్ట్రేషన్ బాగా క్యాప్చర్ చేశారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు మా థియేటర్లకు రావొచ్చు అనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కల్పించింది. పండగ వైబ్రేషన్స్ ఈ ట్రైలర్లో ఉండేట్టు కలర్ ఫుల్ గా కట్ చేశారు. ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ బ్యాచ్‌ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. అది మరో ప్లస్ పాయింట్. ఆల్రెడీ… భీమ్స్ అందించిన పాటలు హిట్టు. వెరసి.. పాటలతో పాటు ట్రైలర్ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచింది.