ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలైన ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్.. మధ్య సంక్రాంతి వార్ జరగబోతోంది. ఈ రెండు సినిమాల కోసం దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందరి దృష్టీ ఈ రెండు సినిమాలపై ఉంటే, ఈ రెండు సినిమాల దృష్టి జనవరి 2పైనే ఉంది. ఎందుకంటే జనవరి 2 వరకూ నార్త్ లో కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూ విధించి, థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలు చేస్తోంది. కొత్త సంవత్సరం వేడుకలకు జనాలు గుమ్మిగూడతారు. తద్వారా కరోనా మరింతగా ప్రబలుతుందని భయం. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో.. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ సినిమాల విడుదలలు సందిగ్థంలో పడ్డాయి. ఇవి పాన్ ఇండియా సినిమాలు. వాటికి నార్త్ మార్కెట్ చాలా కీలకం. 50 శాతం నిబంధనలు ఉండి, రాత్రి కర్ఫ్యూ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమాల్ని విడుదల చేయలేరు. పైగా నార్త్ లో సాయింత్రపు ఆటలు కీలకం. అక్కడ మార్నింగ్ షోలు ఎక్కువ ఫుల్స్ అవ్వవు. నైట్ షోల రాబడే ప్రధానం. అవి రద్దు చేస్తే.. సినిమాలు విడుదల చేయడంలోనే అర్థం ఉండదు. అయితే జనవరి 2 తరవాత ఈ నిబంధన సడలించవచ్చన్నది అందరి నమ్మకం. జనవరి 2 తరవాత కూడా ఇదే నిబంధనలు కొనసాగిస్తే.. ఇక పెద్ద సినిమాలు విడుదల కావు. అందుకే రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. “జనవరి 2 తరవాత.. నిబంధనలు కచ్చితంగా మారతాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అవుతాయి. ఆ నమ్మకంతోనే మేమంతా ఉన్నాం“ అని ఓ పంపిణీదారుడు తెలిపాడు.