కొన్ని సినిమాలు నిర్మాతల్ని వీధికీడుస్తాయి. ఇంకొన్ని వాళ్ల నెత్తిమీద కిరీటాన్ని పెడతాయి. కొన్ని సినిమాలతో హీరోలు డబ్బులు సంపాదించుకొంటారు. ఇంకొన్ని సినిమాలతో అందరూ బాగుపడతారు నిర్మాత తప్ప. కొన్ని సినిమాలు పేరుకు మాత్రమే హిట్టు. నిర్మాత పైకి నవ్వుతున్నా, జేబుకు చిల్లడిపోయి ఉంటుంది.
అసలైన హిట్టంటే ఏమిటో తెలుసా? సినిమా తీసిన వాళ్లు, చూసినవాళ్లే కాదు, ఆ సినిమాని పంపిణీ చేసిన వాళ్లు కూడా బాగుండాలి. డిస్టిబ్యూటర్లకు డబ్బులు మిగిలితే, వాళ్లు మరిన్ని సినిమాలు కొనడానికి ముందుకొస్తారు. అప్పుడు నిర్మాతలు బాగుపడతారు. సినిమా హిట్టయినా, డిస్టిబ్యూటర్లకు కమీషన్లు మిగలని దాఖలాలు ఎన్నో. అయితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం డిస్టిబ్యూటర్లని కూడా నిలబెట్టింది. కనీ వినీ ఎరుగని విధంగా 20 శాతం కమీషన్లను మిగిల్చింది. ఈమధ్య ఐదారేళ్లుగా డిస్టిబ్యూటర్లకు ఈ స్థాయి ఆదాయం ఇచ్చిన సినిమా లేదు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పంపిణీదారులంతా కలిసి టీమ్ ని సన్మానించారు. ‘ఇలాంటి సినిమాలే తీయండి..’ అంటూ ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశ్రమకు సంకేతాలు పంపించారు.
నిర్మాతలు సినిమా సక్సెస్ మీట్ పెట్టి, డిస్టిబ్యూటర్లకు షీల్డులు ఇవ్వడం చాలానే చూశాం. కానీ డిస్టిబ్యూటర్లంతా ఓ సక్సెస్ మీట్ పెట్టి, నిర్మాతని గౌరవించుకోవడం ‘సంక్రాంతికి వస్తున్నాం’తోనే సాధ్యమైంది. నిజంగానే ఇది అపూర్వమైన విజయం. ఓ వర్గం థియేటర్లకు దూరమైన వేళ, వాళ్లని కూడా థియేటర్లకు రప్పించింది ‘సంక్రాంతికి వస్తున్నాం’. బడ్జెట్ తోనో, కాంబినేషన్తోనో అద్భుతాలు జరగవని, మంచి సినిమా ఎప్పుడొచ్చినా, ఎవరు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన సినిమా ఇది. ఈ సక్సెస్ మీట్.. పరిశ్రమలో చాలామంది ఆలోచనా ధోరణిని మారుస్తుందనడంలో సందేహం లేదు.