Sankranthiki vasthunnam Movie review
తెలుగు360 రేటింగ్ : 2.75/5
సంక్రాంతి రేసులో ప్రమోషన్స్ పరంగా అదరగొట్టిన సినిమా ‘సంక్రాంతి వస్తున్నాం’. టైటిల్ తోనే అందరి ద్రుష్టిని ఆకర్షించింది. పాటలు జనాల్లోకి వెళ్ళాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు.. ఈ ముగ్గురిదీ సక్సెస్ ఫుల్ కాంబినేషనే. పైగా వెంకీ కి సంక్రాంతి కలిసొచ్చిన సీజన్. అనిల్ రావిపూడి మినిమం గ్యారెంటీ డైరెక్టర్. ఇలా అన్ని వైపుల సానుకూల అంశాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ ఎలాంటి వినోదాన్ని పంచింది ? పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అయ్యిందా?
అమెరికాలో పెద్ద ఐటీ ఇండస్ట్రీ గల సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) తను పుట్టిపెరిగిన తెలంగాణ పర్యటనకి వస్తాడు. కేంద్రంతో పేచీ పెట్టుకొని మరీ సత్యని ముందుగా తెలంగాణకే తీసుకోస్తాడు ముఖ్యమంత్రి కేశవ(నరేష్). ఫలక్ నూమా ప్యాలెస్ లో విందుకి హాజరైన సత్యని బీజు పాండే అనే గ్యాంగ్ స్టర్ కిడ్నాప్ చేస్తాడు. జైల్లో వున్న తన అన్న పప్పు పాండేని రిలీజ్ చేయాలనేది బీజు పాండే డిమాండ్. ఈ వార్త బయటికి తెలిస్తే ప్రభుత్వం కూలిపోతుంది. నాలుగు రోజులు గడువులో సత్యని బీజు పాండే చెర నుంచి విడిపించడానికి ఎక్స్ కాప్ యాదగిరి రాజు(వెంకటేష్)ని ఆశ్రయిస్తాడు ముఖ్యమంత్రి కేశవ. అసలు ఈ రాజు ఎవరు? తనని వెదుక్కుంటూ వెళ్ళిన మీను (మీనాక్షి చౌదరి)కి తనకున్న గతం ఏమిటి ? ఈ ఆపరేషన్ లోకి రాజు భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్ ) ఎందుకు వచ్చింది ? ఇదంతా మిగతా కథ.
పూర్తిగా వినోదాత్మక చిత్రాలు తీసే అనిల్ రావిపూడి భగవంత్ కేసరిలో కాస్త మార్పు చూపించారు. ఒక కమర్షియల్ కథకు కాస్త మంచి ఉద్దేశం, సందేశాన్ని జోడించారు. ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’లో ఒక ఫ్యామిలీ కథలో క్రైమ్, రెస్క్యు అపరేష్ ని జోడించి జానర్ ని కాస్త ఫ్రెష్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొన్ని నవ్వులు పండాయి. ఇంకొన్ని పేలని పాత జోకులుగా మిగిలాయి.
అనిల్ రావిపూడి పూర్తిగా కామెడీ మీద డిపెండ్ అయ్యే దర్శకుడు. కథ, ఎమోషన్, లాజిక్ కంటే సీన్ లో ఫన్ పండించడంపైనే ఆయన ఫోకస్ వుంటుంది. అయితే ఇందులో ఆయన ఎత్తుగడే తేడా చేసింది. ఫ్యామిలీ జానర్ లో తను ఎంచుకున్న క్రైమ్ ఎలిమెంట్ సరిగ్గా కుదరలేదు. భర్త, భార్య, మాజీ ప్రేయసి.. ఈ ముగ్గురూ ఓ రెస్క్యు ఆపరేషన్ లోకి దిగితే ఎలా వుంటుందనే అలోచనే బాగానే వుంది కానీ ఆ ఆలోచన చుట్టూ సరైన సన్నివేశాల అల్లిక జరగలేదు. ఎఫ్ 2లో పండినంత ఫ్రస్ట్రేషన్ ఇందులో కనిపించదు. దీంతో సినిమా మెయిన్ లైన్ అయిన ఎక్స్ కాప్, ఎక్స లవర్, ఎక్స్ లెంట్ వైఫ్.. ఆడియన్స్ కి సహజమైన నవ్వులు పంచడంలో ఇబ్బంది పడతారు.
సత్య ఆకెళ్ళ కిడ్నాప్ తో కథ మొదలౌతుంది. నరేష్, వీటీవీ గణేష్ ట్రాక్ బిగినింగ్ లో నవ్వించే ప్రయత్నం చేస్తుంది. రాజు, మీను పాత్రలని చకచక పరిచయం చేసి కథ గోదారికి షిఫ్ట్ అయిన తర్వాత విలేజ్ డ్రామా తెరపైకి వస్తుంది. రాజు, భాగ్యం పాత్రల మరీ హిలేరియస్ గా కాకపోయిన లైవ్లీ గా అనిపిస్తాయి. రాజు కొడుకు బుల్లిరాజు నోరు తెరచిన ప్రతిసారి నవ్వులు పూస్తాయి. అయితే దానికి ఓటీటీ ఎఫెక్ట్ అనే కొత్త కలర్ ఇచ్చారు కానీ అప్పుడెప్పుడో జంద్యాల తీసిన ‘హాయ్ హాయ్ నాయిక’ సినిమాలో పిల్లాడి క్యారెక్టర్ కి పేరడీలా అనిపించే పాత్రది. రాజు, మీను లవ్ స్టొరీని ఒక పాటకి పరిమితం చేస్తూ పదునుగానే చూపించారు. భాగ్యం కూడా ఆపరేషన్ లోకి వస్తానని పట్టుబట్టడమే ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోవాలి. దిన్ని ఆల్రెడీ ట్రైలర్ లో చూపించడంతో అంత ఉత్సాహకరమైన సంఘర్షణగా అనిపించదు. సిఎం ఆఫీస్ రాజు ఫిజికల్ ఫిట్నెస్ పై వచ్చే ఎపిసోడ్ వెంకీ మార్క్ హ్యుమర్.
తొలిసగం వరకూ ఓ మోస్తారు కాలక్షేపాన్ని ఇచ్చిన సినిమా సెకండ్ హాఫ్ లో గాడితప్పుతుంది. హాస్పిటల్ లో పప్పు పాండేని తప్పించే ఎపిసోడ్ గమ్మత్తుగా వచ్చింది. యానిమల్ ఫేం ఉపేంద్ర, సాయికుమార్ క్యారెక్టర్స్ తో ఇక్కడ కొన్ని నవ్వులు వుంటాయి. తర్వాత సినిమా పూర్తయిన వరకూ మళ్ళీ ఇంలాంటి బ్లాక్ సెట్ కాలేదు.
డెడ్ బాడీతో చేసిన కామెడీ ఓల్డ్ స్కూల్ అఫ్ థాట్. రాజు, భాగ్యం, మీను పాత్రల నుంచి సహజమైన వినోదం పుట్టలేదు. క్రైమ్ ఎలిమెంట్ రోడ్ ఎక్కిన తర్వాత ఏది తోస్తే అది తీసుకుంటూ వెళ్ళారనే ఫీలింగ్ కలుగుతుంది తప్పితే స్క్రిప్ట్ లో ఒరిజినాలిటీ కనిపించదు. చివర్లో రాజు పాత్ర ఇచ్చిన ‘ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు’ అనే మెసేజ్ విడిగా స్కిట్ లానే వుంటుంది. అన్నట్టు.. చివర్లో గురువుల గౌరవార్థం అన్నట్టు ఓ మెసేజ్ పెట్టారు. కథకు ఎంత మాత్రం సంబంధం లేని మెసేజ్ అది.
ఫ్యామిలీ మ్యాన్ పాత్రలు వెంకటేష్ కి కేక్ వాక్. రాజు పాత్రని కూడా నల్లేరు మీదనడకలా సునాయాసంగా చేసుకుంటూ వెళ్లారు. ఆయన కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియరాలు లాంటి వింటేజ్ వైబ్ కనిపిస్తుంది. క్యారెక్టర్ ఏజ్ కి తగ్గటు ఆయన ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా కొన్ని జోకులు వేసుకున్నారు. భాగ్యం పాత్ర ఐశ్వర్యకు కొత్త. సినిమా అంతా భలే చలాకీగా వుండే పాత్ర అది. కొన్ని చోట్ల అతి అనిపించే ఆ పాత్రని బ్యాలెన్స్ గానే చేసింది. మీనాక్షి యాక్షన్ చేసే కాప్ రోల్. తను హుషారుగా నటించింది. నరేష్, విటీవి గణేష్ ట్రాక్ కొన్నిచోట్ల నవ్విస్తుంది. ఉపేంద్ర సీరియస్ గా కనిపించే కామెడీ రోల్. సాయి కుమార్ బేస్ వాయిస్ తో కూడా నవ్వించే ప్రయత్నం బావుంది. బుల్లిరాజు గా చేసిన పిల్లాడు నవ్విస్తాడు. శ్రీనివాస్ అవసరాలతో పాటు మిగతా నటులు పరిధిమేర కనిపించారు.
భీమ్స్ మ్యూజిక్ సినిమా రిలీజ్ కి ముందే జనాల్లోకి వెళ్లిపోయింది. సినిమాలో కూడా సంగీతమే ప్రధాన ఆకర్షణగా వుంది. గోదారి గట్టు పాట విజువల్ గా కూడా బావుంది. వెంకీ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ హుషారు గా సాగింది. నేపధ్య సంగీతం లైవ్లీ గా వుంది. సమీర్ రెడ్డి కెమరా వర్క్ డీసెంట్ గా వుంది. ప్రొడక్షన్ లో కొన్ని పరిమితులు కనిపించాయి. లిమిటెడ్ లోకేషన్స్ లో చాలా హడావిడిగా సన్నివేశాలు చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఈ పండక్కి ఫ్యామిలీ వైబ్ వున్న సినిమా ఇదొక్కటే కావడం కలిసొచ్చే అంశం. ఇందులో బ్లాక్ బస్టర్ పొంగల్ పాట పేరుతో విడుదలకు ముందే సినిమా బ్లాక్ బస్టర్ అని చాలా నమ్మకంగా ప్రచారం చేసుకుంది చిత్ర బృందం. కానీ బొమ్మ మాత్రం యావరేజ్ తో సరిపెట్టుకునేలా వుంది.
తెలుగు360 రేటింగ్ : 2.75/5