వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాటలు జనాల్లోకి వెళ్ళాయి. ఆడియో పరంగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కథ గురించి హింట్ ఇవ్వలేదు. ట్రైలర్ లో మాత్రం కథని కాస్త రివిల్ చేశారు.
ఓ బిగ్ షాట్ కిడ్నాప్ అవుతాడు. ప్రభుత్వమే కూలిపోయే కిడ్నాప్ అది. అలాంటి మిషన్ వెంకటేష్ కి అప్పగిస్తారు. ఆయన భార్యతో పాటు మాజీ ప్రేయసిని కూడా వెంటబెట్టుకుని ఈ కేసు చేధించడానికి బయలుదేరుతాడు. ఈ ప్రయాణం ఎలా సాగిందనేది మిగతా కథ.
అనిల్ రావిపూడి మార్క్ ఉంటూనే థ్రిల్ సస్పెన్స్ మలుపులు వున్న కథ ఇది. భార్య భర్తలు మధ్యలో మాజీ ప్రేయసి.. ఈ ట్రయాంగిల్ ట్రాక్ ఈ కథలో కీలకం. ఈ ట్రాక్ లో ఫన్ పండితే వర్క్ అవుట్ అయినట్లే. ట్రైలర్ లో అనిల్ మార్క్ వినోదం వుంది.
వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించారు. మాజీ లవర్ జీవితంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకునే సంఘటనలు గమ్మత్తుగా వున్నాయి. వెంకీ టైమింగ్ బావుంది. ఐశ్వర్య పద్దతిగా కనిపిస్తే.. మీనాక్షి టామ్ బాయ్ పోలీస్ గా ఆకట్టుకుంది. భీమ్స్ మ్యాజిక్, కెమరా వర్క్, నిర్మాణ విలువలు కమర్షియల్ కొలతలకు సరిపోయాయి.
‘ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ వున్నట్లు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ వుంటుంది. దయ చేసి మీ పెళ్ళాలకి ఆ ఫ్లాష్ బ్యాక్ లు చెప్పకండి’ అని వెంకీ పేల్చిన డైలాగ్ సరదాగా వుంది.
‘హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతీసారి విక్టరీయే’ అనే డైలాగ్.. ట్రైలర్ లో కొసమెరుపు.