2020పై టాలీవుడ్ నీళ్లు చల్లుకుంది. ఇప్పుడు దర్శక నిర్మాతల దృష్టంతా 2021 సంక్రాంతిపైనే. ఒకవేళ అక్టోబరు – నవంబరులలో థియేటర్లు ఓపెన్ అయినా, సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా లేరు. తమ అదృష్టాన్ని 2021లోనే పరీక్షించుకుందామనుకున్నారు. ముఖ్యంగా 2021 సంక్రాంతికి అప్పుడే సన్నాహాలు మొదలైపోయాయి. ఈ పండక్కి వకీల్ సాబ్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, క్రాక్.. ఇలా చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకునే పనిలో ఉన్నాయి. ఇప్పుడు `అల్లుడు అదుర్స్` కూడా సంక్రాంతికే రాబోతోంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `అల్లుడు అదుర్స్`. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ మళ్లీ ఈరోజు నుంచి మొదలుకానుంది. హైదరాబాద్ లో బెల్లంకొండ – ప్రకాష్ రాజ్‌లపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సోనూసూద్ ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సోనూసూద్ పై కొన్ని సన్నివేశాలు, పాటలూ తెరకెక్కిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఫక్తు కమర్షియల్ సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ బాగా పండిందట. పైగా సంక్రాంతికి `అల్లుడు` సెంటిమెంట్ ఎక్కువ. ఫ్యామిలీ డ్రామాలు బాగా వర్కవుట్ అవుతాయి. అందుకే రిలీజ్నీ సంక్రాంతికే ఫిక్స్ చేశారు. త్వరలోనే టీజర్‌ని వదలబోతున్నారు.