తుపాను ముందు వచ్చే ప్రశాంతం లా 2023 తొలివారం బాక్సాఫీసు నిశ్శబ్దంగా కనిపించింది. 2023 లో తొలి విజయం అందుకొనే అవకాశం సంక్రాంతి సినిమాలకి దక్కింది. వరుసగా నాలుగు రోజులు నాలుగు పెద్ద సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి. ఇందులో రెండు తెలుగు సినిమాలు మరో రెండు డబ్బింగ్ సినిమాలు వున్నాయి. కళ్యాణం కమనీయం అనే మరో చిన్న తెలుగు సినిమా కూడా వుంది.
అజిత్ తెగింపు ముందుగా బరిలో దిగుతుంది. జనవరి 11న సినిమా విడుదలౌతుంది. అజిత్ స్టార్ హీరో. అతని సినిమాకి ఇక్కడ కొందరు అభిమానులు వున్నారు. అయితే అజిత్ ద్రుష్టి తెలుగుపై లేదు. ఇక్కడ కనీస ప్రమోషన్స్ చేయలేదు. మంచి థియేటర్స్ కూడా ప్రయత్నం జరిగినట్లు కనిపించలేదు. ఓపెనింగ్స్ రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. టాక్ బావుంటే మాత్రం ప్రేక్షకుల ద్రుష్టి సినిమాపై పడే అవకాశం వుంది.
12న బాలకృష్ణ వీరసింహా రెడ్డి వస్తోంది. భారీ అంచనాలు వున్న చిత్రాల్లో వీరసింహా రెడ్డి ముందు వరుసలో వుంది. అఖండ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది. క్రాక్ లాంటి హిట్ తర్వాత గోపీచంద్ మలినేని రాసుకున్న కథ. సీమ కథలు చేయడంలో బాలకృష్ణ ట్రాక్ రికార్డ్ వేరు. ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసింది. పక్కా బ్లాక్ బస్టర్ అని యూనిట్ అంతా నమ్మకంగా వుంది.
13న వాల్తేరు వీరయ్య వస్తోంది. చిరంజీవితో రవితేజ కలసి రావడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. బాబీ చిరంజీవి ని వింటేజ్ లుక్ లో ప్రజంట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమాగా కనిపిస్తోంది. మాస్ మసాలా సినిమాలకు చిరంజీవి పెట్టింది పేరు. ఇందులో ఆ ఎలిమెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వీరసింహా, వీరయ్య రెండు సినిమాలని నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు ముందు సత్తా చాటుతాయనే నమ్మకం నిర్మాతల్లో వుంది.
14న వస్తోంది దిల్ రాజు విజయ్ వారసుడు. నిజానికి 11న రావాల్సిన సినిమా ఇది. చివరి నిమిషంలో మన తెలుగు స్టార్స్ సినిమాలకి ప్రాధన్యత ఇవ్వాలని 14కి షిఫ్ట్ చేశారు దిల్ రాజు. మిగతా రెండు సినిమాలకి ఇది ప్రత్యేకమైనది. ఆ రెండు మాస్ సినిమాలైతే ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. ఆల్రెడీ తెలుగులో చూసిన చాలా సినిమాలు ట్రైలర్ చూస్తే గుర్తుకు వచ్చాయి. కానీ ఇందులో అద్భుతమైన ఒక కొత్తపాయింట్ వుందని దిల్ రాజు ఆశలు రేపుతున్నారు. ఆ ‘కొత్త’ పాయింట్ పై ఈ సినిమా ఫలితం ఆధారపడి వుంది.
ఇదే రోజు సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం అనే సినిమా కూడా వస్తోంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇన్ని పెద్ద సినిమాల పోటీ తట్టుకొని నిలబడటమే ఆ సినిమా ముందు వున్న పెద్ద సవాల్. మొత్తానికి 2023లో తొలి విజయం అందుకునే అవకాశం ఈ సినిమాలన్నిటికీ వుంది. మరి ఇందులో విజేత ఎవరో వారం రోజుల్లో తేలిపోతుంది.