సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడం కొత్త కాదు. ఒకే సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ గతంలో సంక్రాంతికి విడుదల చేసింది.
2025 సంక్రాంతికి కూడా ఒకే సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు రావడం ఖరారైయింది. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పండగ బరిలో నిలుస్తున్నాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ కి, దిల్ రాజు నుంచి వచ్చే సినిమాలకి ఒక తేడా ఉంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం దిల్ రాజు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా 2025 సంక్రాంతికి రావాలి. అయితే దిల్ రాజు.. చిరంజీవి, యువీ సంస్థను కలిసి గేమ్ ఛేంజర్ కు సోలో రిలీజ్ డేట్ ఇవ్వాల్సిందిగా కోరారు. అటు చిరంజీవి సినిమా కావడంతో సహజంగానే రామ్ చరణ్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ కి సోలో రిలీజ్ అనుకున్నారు.
అయితే దిల్ రాజు నిర్మిస్తున్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా కూడా సంక్రాంతి బరిలో రావడం ఫిక్స్ అయిపోయింది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా ? అనే ఒక చర్చ నడిచింది. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కంటెంట్ ని తయారు చేసుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిలే ఈ కథకి యాప్ట్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిందేనని అనిల్ పట్టుపట్టారని వినిపించింది. దిల్ రాజు కాస్త ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. దీంతో లేటెస్ట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఖరారు చేసి గేమ్ ఛేంజర్ తో పాటు వెంకటేష్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతుందని సంకేతాలు ఇచ్చేశారు.
రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న గేమ్ ఛేంజర్ చాలా పెద్ద సినిమా. మొదటి నుంచి దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ డేట్ మీద చాలా పర్టిక్యులర్ గా ఉన్నారు. చివరికి సంక్రాంతి రిలీజ్ అనుకుని విశ్వంభర ని వాయిదా వేయించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన సంస్థ నుంచే మరో సినిమా గేమ్ ఛేంజర్ కి పోటీకి రావడం చర్చనీయంశంగా మారింది.
గేమ్ ఛేంజర్ కి సంక్రాంతికి వస్తున్నాం గట్టి పోటీనే, ఎందుకంటే వెంకటేష్ ఫ్యామిలీ హీరో. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే ఫాలోయింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే అనిల్ రావిపూడి కూడా బ్లాక్ బస్టర్ డైరెక్టర్. ఆయనకు అసలు అపజయాలే లేవు. ఇక సంక్రాంతి లాంటి సీజన్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించడంలో ఆయనది సపరేట్ ట్రాక్ రికార్డు. ఏ రకంగా చూసుకున్న గేమ్ చేజర్ కి సంక్రాంతికి వస్తున్నాం నుంచి బలమైన పోటీ ఉంటుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ కి సోల్ డేట్ కోసం విశ్వంభర వాయిదా కోరిన దిల్ రాజు ఇప్పుడు ఆయన సంస్థ నుంచే మరో సినిమాని దించే అనివార్య పరిస్థితి రావడం ధర్మ సంకటమే.