సంక్రాంతి పర్వదిన సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు పల్లె బాట పట్టడంతో హైదరాబాద్ నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. హైదరాబాద్ లో నివసించే ప్రతి ఒక్కరి మూలాలు ఊళ్లలో ఉండడంతో, సంక్రాంతి పండుగని ఆ ఊళ్లోనే జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు తరలి వెళ్లడంతో నగరం ఖాళీగా కనిపిస్తోంది.
గణాంకాల ప్రకారం చూస్తే, దాదాపు 30 లక్షల మంది నగర వాసులు ఊళ్లకు వెళ్ళినట్లుగా చెబుతున్నారు. అలాగే రోడ్లు ఖాళీగా ఉండటంతో, రోడ్ల మీద వాహనాల సగటు వేగం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మామూలుగా అయితే నగర పరిధిలో గంటకు 18 కిలోమీటర్లు ఉండే వాహన వేగం ఇప్పుడు రోడ్లు ఖాళీగా ఉండడంతో గంటకు 40 కిలోమీటర్ల వేగం సగటు వేగం గా ఉందని వారు చెబుతున్నారు. కూకట్పల్లి, అత్తాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, ఆబిడ్స్, ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే దుకాణదారులు అంతా సమ్మె చేస్తున్నారా అన్నట్టుగా సాయంకాలం నుండి దుకాణాలన్నీ మూతపడి ఉన్నాయి. ఏడాది మొత్తం కిటకిటలాడే హోటళ్ళ ముందు సైతం ‘సెలవు బోర్డులు’ దర్శనమిస్తున్నాయి.
సంక్రాంతి పండగతో పాటు, వరుస సెలవులు కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మిగతావారు కూడా ఆయా రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో నగరం బోసిగా, ఏ మాత్రం రణగొణ ధ్వని లేకుండా ప్రశాంతంగా, ఖాళీగా కనిపిస్తోంది.