ప్రతీ యేటా సంక్రాంతికి థియేటర్లు కళకళలాడిపోవడం చూస్తూనే ఉంటాం. ఈసారీ ఆ హంగామా కనిపించింది. స్టార్ హీరోలు దూరమైనా, నాలుగు సినిమాలొచ్చాయి. బంగార్రాజు, హీరో, రౌడీ బోయ్స్, సూపర్ మచ్చీ సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ మచ్చీకి ఏమాత్రం ప్రమోషన్లు లేకపోవడంతో అసలు ఆ సినిమానే ఎవరూ లెక్కలోనికి తీసుకోలేదు. ఇక మిగిలినవి మూడే సినిమాలు. అందులో బంగార్రాజు ఒక్కటే స్టార్ సినిమా. మిగిలిన రెండు సినిమాల్లోనూ డెబ్యూ హీరోలే.
మొహమాటం లేకుండా చెప్పాలంటే మూడూ అత్తెసరు మార్కులు తెచ్చుకున్న సినిమాలే. విమర్శకుల ప్రశంసలు దేనికీ దక్కలేదు. అన్నీ బిలో యావరేజ్ లే. కాకపోతే.. బంగార్రాజుకి మంచి వసూళ్లు వచ్చాయి. పండగ సీజన్ ని క్యాష్ చేసుకున్న సినిమా అదే. తొలి మూడు రోజుల్లో రూ50 కోట్లు సంపాదించామని చిత్రబృందం చెబుతోంది. నాగార్జున సినిమా. అందులోనూ చైతూ ఉన్నాడు. పండగ వాతావరణం.. ట్రైలర్లో కనిపించింది. దాంతో.. కుటుంబ ప్రేక్షకులు బంగార్రాజు వైపు మొగ్గు చూపించారు. చిన్న గీత పెద్ద గీతలా కనిపించాలంటే పక్కన మరింత చిన్న గీత గీయాలి. బంగార్రాజు చిన్న గీతే కావొచ్చు. కానీ.. దాని పక్కన రౌడీ బోయ్స్, హీరో.. ఇంకా చిన్న గీతలు. దాంతో బంగార్రాజు పెద్ద గీతైపోయింది. ఈ సంక్రాంతికి ఈ సినిమానే దిక్కయ్యింది. దాంతో వసూళ్లు జోరుగా అందుకున్నాడు. రౌడీ బోయ్స్ కీ కొద్దో గొప్పో వసూళ్లు ఉన్నాయి. హీరోకి అంతంత మాత్రమే ఆదరణ దక్కింది. ఎటు చూసినా, ఈ సంక్రాంతి విజేత బంగార్రాజే. కాకపోతే… నికార్సయిన సినిమా లేని లోటు ఈ పండక్కి బాగా కనిపించింది.