పవన్ కల్యాణ్ దగ్గర ఓ సౌలభ్యం ఉంది. తనని ఎవరు వాడుకొన్నా కాదనడు. పవన్ ఫ్యాన్స్ కూడా చాలా మంచోళ్లు. పవన్‌ని ఎవరు వాడుకొన్నా, ఎంత పిండుకున్నా వాళ్లకూ పవన్ ఫ్యాన్స్.. ఫ్యాన్సయిపోతారు. పవన్‌ని ఎడా పెడా వాడుకోవడంలో నితిన్ తరవాతే ఎవరైనా. నితిన్‌ని చూసి మిగిలినవాళ్లూ పవన్‌ని వాడడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ జాబితాలో సప్తగిరి కూడ చేరాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫంక్షన్‌కి పవన్ కల్యాణ్ రాక… అందరికీ షాక్ ఇచ్చింది. ఆ వేదికపైనే పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకొనే ప్రయత్నం చేశాడు సప్తగిరి. పవన్ కూడా సప్తగిరి అభిమానానికి పులకించిపోయాడు. ”సప్తగిరి ఎక్స్‌ప్రెస్ నాక్కూడా చూడాలని వుంది” అంటూ ఈ కమిడియన్పై ప్రేమ కురిపించాడు. ఈ వీడియో క్లిప్పింగ్‌నే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ప్రమోషన్లలో తెగ వాడుకొంటున్నాడు సప్తగిరి.
సప్తగిరి వాడకం ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావన ఉండబోతోందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పేరు స్మరిస్తూ, పవన్ కల్యాణ్ అభిమానుల్ని ప్రసన్నం చేసుకొనే విధంగా ఈ సినిమాలో కొన్ని సీన్లు డిజైన్ చేశారట. ఈ సన్నివేశాలన్నీ సప్తగిరే స్వయంగా రాసినట్టు సమాచారం. ఆయా సన్నివేశాలన్నీ పవన్ కల్యాణ్ అభిమానుల్ని ఆకట్టుకొనేలా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఆ డోసు బాగా ఎక్కువైందని, పవన్ భజన ఆఫ్ ది ఇయర్‌గా ఈ సినిమానే ఎంపిక చేసేయొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానుల్ని మెప్పిస్తే చాలు… నాలుగు టికెట్లు ఎక్కువగా తెగుతాయి అనుకొనే బాపతు సినిమాల జాబితాలో సప్తగిరి ఎక్స్ ప్రెస్ కూడా చేరిపోయిందన్నమాట. మరి ఆ వాడకం ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతుంది.