ఒక్కో సీజన్లో ఒకొక్క కమిడియన్ హవా నడుస్తుంటుంది. అలా.. కొన్నాళ్లు సప్తగిరి ట్రెండ్ నడిచింది. ఏ సినిమాలో చూసినా… తన కంటూ ఓ కామెడీ ట్రాక్ ఉండేది. ఆ తరవాత.. సప్తగిరి హీరో అవ్వడం, తన కామెడీకి ప్రాధాన్యం తగ్గుతూ రావడం జరిగాయి. ఇప్పుడు సప్తగిరి మరీ నల్లపూసగా మారిపోయాడు. చాలా కాలం తరవాత సప్తగిరికి ఓ అదిరిపోయే క్యారెక్టర్ పడింది. `ఏక్ మినీ కథ`లో. సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రమిది. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈవారాంతంలో అమెజాన్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. థియేటర్లో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఓటీటీ పాలైపోయింది.
ఈ సినిమా మొత్తం ఫన్ రైడ్ గా ఉంటుందని, సెకండాఫ్ లో సప్తగిరి కామెడీ హైలెట్ గా మారిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇందులో సప్తగిరి.. హీరోకి స్నేహితుడిగా, ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఆంధ్రాలో పుట్టి, పంజాబ్ లో సెటిలైపోయిన లారీ డ్రైవర్ స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాద్ రావడం, స్నేహితుడికి దగ్గరుండి ఫస్ట్ నైట్ జరిపించాలని కలలు కనడం, ఆ ఫస్ట్ నైట్ అన్నదే హీరోకి సమస్యగా మారడం… ఇదీ సెకండాఫ్ కథ. సప్తగిరి కామెడీ ట్రాక్, పంచ్లూ.. ఓ రేంజ్లో ఉంటాయని, ఓ దశలో హీరోని డామినేట్ చేస్తూ.. నవ్వులు పండించాడని తెలుస్తోంది. ఈ సినిమాతో సప్తగిరి టైమ్ మళ్లీ మొదలు అవుతుందని `ఏక్ మినీ కథ` చూసినవాళ్లంతా చెబుతున్నమాట. మరి.. నిజంగానే ఆ పాత్రలో అంత మేటర్ ఉందా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.