Saptagiri LLB review
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
చెట్టుకింద ప్లీడరు సినిమా గుర్తుందిగా. సీనియర్ డైరక్టర్ వంశీ చాలా ఏళ్ల క్రితం తీసిన మ్యూజికల్ అండ్ మ్యాజికల్ హిట్. అలాంటి సినిమా బాలీవుడ్ లో రావడానికి చాలా టైమ్ పట్టింది. మనకు పొరుగింటి పుల్లకూర అంటే చాలా ఇష్టం కాబట్టి, అలా బాలీవుడ్ లో వచ్చిన జాలీ ఎల్ ఎల్ బి సినిమాను బోలెడు డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుని, తెలుగులోకి తర్జుమా చేసే ప్రయత్నం చేసాడు కమెడియన్ సప్తగిరి.
రెడీమేడ్ షర్ట్ మనకు పక్కగా సూటయిపోతే ఫరవాలేదు. లేదూ అంటే మళ్లీ దాన్ని రీసైజ్ చేయించుకుంటే అంత బాగోదు. హీరోలు సైతం అందుకే తమకు పక్కాగా నప్పుతుందనుకునే సినిమాలనే తెలుగులోకి రీమేక్ చేస్తారు. అయితే సప్తగిరి వ్యవహారం వేరుగా వుంది. షర్ట్ ఎలాంటిదైనా తాను అందులో ఫిట్ అయిపోతానని ఓ ప్రగాఢ నమ్మకం అతగాడిది. కానీ హీరో మరో మెట్టు ఎక్కాలంటే సినిమా అంతకు మించి వుండాలి. కానీ సినిమా లెవెల్ నే కిందకు వుంటే తేడా కొట్టేస్తుంది. అందుకే జాలీ ఎల్ఎల్బీ కాస్తా, సప్తగిరి ఎల్ఎల్బీ అయిపోయింది.
కథ
సప్తగిరి(సప్తగిరి) కొత్తగా నల్లకోటు వేసుకున్న పల్లెటూరి లాయరు. అక్కడ వుంటే తనకు పేరు గట్రారావని ఏకంగా హైదరాబాద్ వచ్చేస్తాడు. అదే సమయంలో ఫుట్ పాత్ మీద పడుకున్నవారిని కారుతో ఢీకొట్టి చంపిన డబ్బున్న కుర్రాడి కేసు విచారణకు వస్తుంది. కుర్రాడి తరపున వాదించేది టాప్ మోస్ట్ లాయర్ రాజ్ పాల్(సాయికుమార్) ఇలాంటి కేసులో పిల్ వేసి రీఓపెన్ చేయిస్తాడు సప్తగిరి. అక్కడి నుంచి రాజ్ పాల్ కు, సప్తగిరి మధ్య ఢీ అంటే ఢీ మొదలవుతుంది. చివరకు ఎవరు గెలిచారు అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ
సూటు వేసుకోవాలని అందరికీ వుంటుంది. మామూలుగా అయితే వేసేసుకోవచ్చు. కానీ సినిమాల్లో మాత్రం సూటవుతుందా లేదా అని చూసుకోవాలి. ఎవిఎస్ నత్తిగా మాట్లడితే జనం ఆదరించారు. బాబుమోహన్ కోటాతో తన్నులు తింటే నవ్వారు. సునీల్ బంతిలా వుంటే భలే భలే అన్నారు. అక్కడ నవ్వింది, ఆదరించింది, వాళ్లు వేసిన వేషాలు చూసి. ఆయా వేషాల్లో వాళ్ల నటనను చూసి. అక్కడ వాళ్ల నటన ప్లస్ వాళ్ల పాత్రలు రెండూ సింక్ అయ్యాయి కాబట్టి విజయాలు వరించాయి. కానీ మన కమెడియన్ల థింకింగ్ వేరుగా వుంటుంది. జనాలు తమను ఆదరించారని, ఇక తాము ఏ వేషమైనా వేసేయవచ్చనీ అనుకుంటారు. అక్కడే సూట్ సూటుకాకుండా పోతుంది.
ఈ సూటు కానీ సూటు ట్రయిల్ అన్నది ఇప్పుడు కమెడియన్ సప్తగిరి వంతు వచ్చింది. సప్తగిర ఎక్స్ ప్రెస్ అంటూ ఓ ట్రయిల్ వేసి, మళ్లీ సప్తగిరి ఎల్ఎల్బీ అంటూ రెండో ప్రయత్నంతో ఇప్పుడు జనం ముందుకు వచ్చాడు. హిందీలో హిట్ అయిన జాలీ ఎల్ ఎల్ బీ ని తెలుగులోకి తెచ్చాడు. కానీ ఒక్కసారి అలనాటి చెట్టుకిందప్లీడరు సినిమాను, తన సినిమాను పక్కపక్కన వేసుకుని చూస్తే తెలుస్తుంది. సినిమా మేకింగ్ లో క్వాలిటీ అంటే ఏమిటో? కథనం అంటే ఏమిటో?
జాలీ ఎల్ ఎల్ బి సినిమా థిన్ పాయింట్ తో అల్లుకున్న కథతో నడుస్తుంది. ఈ కథలో హీరో క్యారెక్టర్ కాస్త ఫన్ కావచ్చు కానీ, కథనం ఫన్ కాదు. కోర్టు, న్యాయవాదులు, కేసు అంతా సీరియస్ గా నడవాల్సిందే. వాళ్ల మధ్యలో హీరోనే కాస్త ఫన్ పర్సనాలిటీ. కానీ సప్తగిరి ఎల్ఎల్బీ సినిమా విషయంలో దర్శకుడు చరణ్ లక్కాకుల ఇక్కడే తప్పు చేసాడు. సప్తగిరి అంటే వినోదం కాబట్టి, అతని చుట్టూ అక్కర్లేని ఫన్ ను చేర్చాలని చూసాడు. షకలకశంకర్, అప్పారావు, లాంటి వాళ్లును తీసుకువచ్చి, సినిమాను జబర్దస్త్ షో చేసే ప్రయత్నం చేసాడు. సప్తగిరి బలం, ఆడియన్స్ ఏరకం అన్నది దర్శకుడికి కాస్త అయిడియా వుంది. అందుకే తొలిసగంలో కాస్త కామెడీ ప్రవేశపెట్టాలని చూసాడు. నిత్యం టీవీలో చూసే జబర్దస్త్ ఫేస్ లను సినిమాలో చేర్చాడు. కానీ అది హాస్యంలా కాకుండా అపహాస్యంలా వుంది. సినిమా ఎత్తుగడ కోసం పెట్టుకున్న పంచాయతీ సీన్, ఆ వెంటనే వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్, ఆ తరువాత వచ్చే కొన్ని కోర్టు సీన్లు చాలా నాసిరకంగా వుంటాయి. ఇంకోలా చెప్పాలంటే సప్తగిరి లెవెల్ లో వుంటాయి. సప్తగిరి మరో మెట్టు ఎక్కాలంటే సినిమా మరో లెవెల్ లో వుండాలి. అంతే కానీ తన లెవెల్ కు దిగిపోకూడదు. సినిమా ప్రారంభం, ఎత్తుగడ చూస్తే ఇలాగే అనిపిస్తుంది. సినిమాలోని మెయిన్ పాయింట్ కు, దానికి వెల్డింగ్ చేసిన కమర్షియల్ కమ్ సప్తగిరి అభిరుచులకు అంతగా అతుకు సరిపోలేదు. దాంతో తొలిసగం పెద్దగా ఏమాత్రం ఆసక్తి కలిగించకుండా, ఏ విధమైన ముద్ర వేయకుండానే ముగుస్తుంది. పైగా ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే, అసలు ఆ బ్యాంగ్ కోసమే లేని చప్పుడు చేసారేమో అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో కథనం కాస్త కుదుటపడుతుంది. ఎప్పుడైతే పాటలు, ఫైట్లు అయిపోయాయో, ఇక అసలు విషయం మాత్రమే మిగిలిందో, అక్కడి నుంచి సినిమా బాగానే వుంది అనిపిస్తుంది. సినిమా గాడిన పడింది అనిపించిన కాస్సేపటికే ముగుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య వుంది. సీరియస్ సినిమా నచ్చేవారికి ఈ అపహాస్యం నచ్చదు. సప్తగిరి కామెడీ నచ్చేవారికి ఈ సినిమాలో అది కనిపించదు. ఎవరేమనుకున్నా ఇక్కడ మరోసారి చెట్టుకింద ప్లీడరు ప్రస్తావన తేక తప్పదు. అక్కడ కోర్టు బయట మాత్రమే వినోదం వుంటుంది. సరదా వుంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ సీరియస్ గా సాగుతాయి. ఇక్కడ కోర్టునో జోవియల్ చేసేద్దామన్న తపన కనిపించింది. పోనీ అలాగే వెళ్లారా? అంటే చివర్న సాయికుమార్ చకచకా ఇంగ్లీష్ లో స్పీచ్ దంచేస్తాడు. అది కామన్ ఆడియన్ కు ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.
మొత్తం మీద సింగిల్ లైన్ లో చెప్పాలంటే సినిమా రెంటికి చెడిన రేవడి అనుకోవాలి. అటు సప్తగిరి ని అభిమానించేవారికి నచ్చే ఫన్ లేదు. ఇటు జాలీ ఎల్ఎల్బీ సినిమా మాదిరిగా మెప్పించే స్థాయి కథనమూ లేదు.
నటీనటులు
డ్యాన్స్ లు పక్కన పెడితే నటుడిగా సప్తగిరి బాగానే చేసాడు. సీన్లలో సీరియస్ ను తగ్గించకుండా వుండడానికి తన వంతు కృషి బాగానే చేసాడు. హీరోయిన్ కాసిష్ ఒహ్రా ను ఎక్కడి నుంచి పట్టుకువచ్చారో? ఆ నటనేమిటో? సాయికుమార్ తన సీనియార్టీ ప్రకారం బాగానే చేసాడు. శివప్రసాద్ ఓకె.
సాంకేతికత
సినిమా నిర్మాణ విలువలు ఓకె. కోర్టులను సినిమాటిక్ గా కాకుండా కాస్త రియలిస్టిక్ గా చూపించిన ఆర్ట్ డైరక్టర్ ను మెచ్చుకోవాలి. బుల్గానిన్ సంగీతంలో పాటలు ఏదోలో, ఏవిటోలా వున్నాయి. చరణ్ లక్కాకుల దర్శకత్వం సీరియస్ సన్నివేశాల్లో బాగుంది. అక్కడ జాలీ ఎల్ ఎల్ బి కాస్త పనికి వచ్చినట్లుంది. స్వంతగా చేసిన కమర్షియల్, కామెడీ సీన్లు జబర్దస్త్ స్థాయిలోనే వున్నాయి. మాటలు బాగున్నాయి. చాలా మాటలు మాతృకకు మక్కీకి మక్కీ అన్నట్లు సాగాయి.
ఫైనల్ టచ్
గుమస్తాకు ఎక్కువ – లాయర్ కు తక్కువ
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5