కమెడియన్లు హీరోలు అవ్వడం వరకూ కొత్త విషయం కాదు. అప్పటి రాజబాబు నుంచి ఇప్పటి సప్తగిరి వరకూ హీరోయిజాన్ని రుచి చూడడానికి తాపత్రయపడినవాళ్లెంతమందో! అయితేచాలా మంది హీరోలుగా ఫెయిలయ్యి, మళ్లీ కామెడీ వేషాలవైపుకే వెళ్లిపోయారు. సప్తగిరి టైమ్ కూడా ఏం బాగాలేదు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బీ రెండూ పోయాయి. ఇప్పుడు సప్తగిరి వెడ్స్ సన్నీలియోన్, సప్తగిరికి దెయ్యం పట్టింది లాంటి సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇవి పట్టాలెక్కుతాయో లేదో తెలీదు. సప్తగిరి మళ్లీ యధావిధిగా కామెడీ వేషాలు వేసుకోవడమే నయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సప్తగిరి ఆలోచన మాత్రం మరోలా ఉంది. తను దర్శకత్వం వహిస్తాడట.
నిజానికి సప్తగిరి వచ్చిందే మెగా ఫోన్ పట్టడం కోసం. బొమ్మరిల్లు నుంచి కందిరీగ వరకూ చాలా సినిమాలు సహాయ దర్శకత్వం వహించాడు. అందుకే ఇప్పుడు దర్శకత్వం వైపుకు దృష్టి మర్చడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు. సప్తగిరికి ఉన్న పాపులారిటీకి ఓ సినిమా సెట్ చేసుకొని, సెట్స్‌పైకి తీసుకెళ్లడం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. నిర్మాతలూ రెడీగానే ఉంటారు. కానీ అక్కడా బోల్తా పడిపోతే?? ఇప్పుడొస్తున్న కామెడీ వేషాలు కూడా రావు కదా?? కామెడీకి టాలీవుడ్లో స్వర్ణయుగం నడుస్తోంది. కమెడియన్‌గా నాలుగైదేళ్లు రాణిస్తే.. లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. పైగా రిస్కు లేని వ్యవహారం. ఇదంతా వదిలేసి హీరోయిజం అన్నాడు సప్తగిరి. అక్కడ రాణించలేకపోయాడు. ఇప్పుడు దర్శకత్వం అంటున్నాడు. ఇక్కడైనా రాణిస్తాడంటారా??