కమెడియన్ నుంచి హీరోగా ప్రమోషన్ తెచ్చుకొన్నాడు సప్తగిరి. తొలి సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ కాస్త అటూ ఇటూగా ఉన్నా వసూళ్లు మాత్రం బాగున్నాయి. దాంతో సప్తగిరి ఎక్స్ప్రెస్ టీమ్ ఈరోజు సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. సక్సెస్ మీట్లో సంతోషంగా ఉండాల్సిన సప్తగిరి….. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సప్తగిరి ఎందుకు హర్టయ్యాడు? కారణమేంటి?
సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాపై, తనపై ఓ వెబ్సైట్ నెగిటీవ్ వార్తలు రాయడం వల్లే సప్తగిరి కన్నీళ్లు పెట్టుకొన్నాడని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాపై రివ్యూలేం గొప్పగా రాలేదు. సోసో సినిమా అని విశ్లేషకులు తేల్చేశారు. అదే సప్తగిరిని కలిచివేసుంటుంది. ”లక్షలమంది మా సినిమా బాగుందని మెచ్చుకొన్నారు. కానీ మీకు మాత్రం నచ్చలేదు. మా కుటుంబాలు హర్టయ్యేలా వార్తలు రాశారు. వాటిని తట్టుకొనే శక్తి మా ఇంట్లో వాళ్లకు లేదు. వాళ్లంతా పెద్దవాళ్లు. ఇప్పుడు వాళ్లు నవ్వుతూ ఉండాలి. సంతోషకరమైన విషయాలనే స్వీకరించే వయసు వాళ్లది. మీకు మాత్రం కుటుంబాలు లేవా.. వాళ్లు సంతోషంగా ఉండాలని మీరు అనుకోరా” అంటూ తన ఆవేదన వెళ్లగక్కాడు సప్తగిరి. ఇదంతా రివ్యూలపైనా, వాటిని రాసేవాళ్లపైనే అనేది అర్థమవుతూనే ఉంది.
అయితే ప్రత్యేకించి ఓ వెబ్ సైట్ మాత్రం కావాలని సప్తగిరిపై నెగిటీవ్ వార్తలు రాస్తున్నారన్న విషయం సప్తగిరి దృష్టికి వెళ్లింది. అదేరోజు తమ సినిమాతో పాటు విడుదలైన మిగిలిన సినిమాలకు కలక్షన్లు లేకపోయినా.. వాటికి ఎక్కువ రేటింగులు ఇచ్చారని, కావాలని తమ సినిమాని తొక్కే ప్రయత్నం చేశారని సప్తగిరి వాపోతున్నాడని తెలుస్తోంది. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక సప్తగిరి కన్నీళ్లు పెట్టుకొన్నాడు. హీరోగా సప్తగిరికి ఇదే తొలి సినిమా. తనెంతో దూరం ప్రయాణం చేయాల్సివుంది. ఇలాంటి మొట్టికాయలు, గట్టిదెబ్బలూ ఎన్నో చూడాల్సివుంది. ప్రతీ హీరోకీ ఇలాంటి క్రిటిసిజం తప్పలేదు. కాకపోతే ఆ ప్రయాణంలో అలవాటు చేసుకొన్నారు. తొలి సినిమాకే ఈ స్థాయిలో విమర్శలు రావడం వల్ల… సప్తగిరి కాస్త ఫీలై ఉంటాడు. నిజానికి తన వంతు పాత్రని సప్తగిరి చాలా సమర్థంగా పోషించాడు. కష్టం తెరపై కనిపిస్తూనే ఉంది. ‘ఇంత కష్టపడితే సినిమా బాలేదని ఒక్క మాటలో తేల్చేస్తారా’ అన్నది సప్తగిరి బాధ కావొచ్చు.