ఈమధ్య మన దర్శకులకు తెలుగు సాహిత్యంపై మరింత ప్రేమ పెరిగింది. క్రిష్ `కొండపాలెం` నవలని సినిమాగా తీస్తున్నాడు. చలం `మైదానం`గా త్వరలోనే వెండి తెరపై రాబోతోంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా ఓ నవలను కొన్నట్టు ప్రచారం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘శప్తభూమి’ నవలని ఇంద్రగంటి కొన్నట్టు, దాన్ని వెబ్ సిరీస్ గా తీస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇంద్రగంటి కూడా.. ”ఆ నవల చదివాను. చాలా బాగుంది. అందుకే హక్కులు తీసుకున్నా. సినిమాగా తీద్దామనుకుంటున్నా. వెబ్ సిరీస్ గా అయితే ఇంకా బాగుంటుంది” అని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అయితే.. ‘శప్తభూమి’ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని రచయిత బండి నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఈ హక్కులు తన దగ్గరే ఉన్నాయని, సినిమాగా గానీ, వెబ్ సిరీస్‌గా గానీ తన నవలని తెరకెక్కించే హక్కులు ఎవరికీ ఇవ్వలేదని తేల్చి చెప్పేశారు. మరి… ఇంద్రగంటి ఎందుకలా చెప్పారో? బహుశా.. హక్కుల విషయంలో ఇంద్రగంటి ఫిక్స్ చేసిన రేటు, రచయితకు నచ్చి ఉండదు. లేదంటే ఇంకా బేరసారాలు ఓ కొలిక్కి వచ్చి ఉండవు. లేదంటే ఇంద్రగంటి కంటే మంచి బేరం మరో చోట నుంచి వచ్చి ఉంటుంది. హక్కుల ఇంకా తన చేతికి రాకుండానే.. ఇంద్రగంటి ఎందుకు తొందరపడినట్టో..? మొత్తానికి `శప్తభూమి`ని దృశ్య రూపంలో చూద్దామన్న సాహితీ ప్రియులకు ఇది చేదువార్తే.