సునీల్ మంచి హాస్యనటుడు. కెరీర్ బిగినింగ్ తను చేసిన కామెడీ అందరినీ కడుపుబ్బానవ్వించేది. తర్వాత హీరోగా మారాడు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత కేవలం కామెడీ కాకుండా క్యారెక్టర్ బలం వుండే పాత్రల వైపు చూశారు. కలర్ ఫోటో, పుష్ప, మహావీరుడు.. సునీల్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబెట్టిన సినిమాలే.
ఇప్పుడు సప్తగిరి కూడా సునీల్ లాంటి గ్రాఫ్ ని కోరుకుంటున్నారు. ‘కామెడీ పాత్రలు చాలా చేశాను. మళ్ళీ అదే టైమింగ్ రైమింగ్ వుండే పాత్రలు చేయడంలో నాకు కిక్ దొరకడం లేదు. సునీల్ అన్నలా మంచి క్యారెక్టర్ బలం వుండే సినిమాలు చేయాలని వుంది. నటుడిగా నాలో ఆ సత్తా వుంది. కథలో బలమైన పాత్రలని మోయగలననే నమ్మకం వుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఒకే తరహలో వుండే కామెడీ రోల్స్ చేయడం లేదు. హాస్యనటుడిగా ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు మంచి క్యారెక్టర్ బలం వున్న పాత్రల్లో నిరూపించుకోవాలని వుంది’అని తన మనసులో మాట చెప్పారు సప్తగిరి.
అన్నట్టు..సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా మార్చి 21న వస్తోంది. ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం. సప్తగిరి అనిల్ రావిపూడి మంచి ఫ్రెండ్స్. అనిల్ కారణంగా ప్రాజెక్ట్ నిర్మాత శిరీష్ వద్దకు వెళ్ళింది. కామెడీ సినిమా కావడంతో వేసవి వినోదంగా సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.