ఏపీ ప్రభుత్వ పెద్దలు మొన్నటిదాకా శారదాపీఠాధిపతిపై ఎక్కువ ఆపేక్ష చూపేవారు. ఆస్థాన గురువుగా భావించేవారు. ఇటీవలి కాలంలో ఆయనకు ప్రాధాన్యం తగ్గించి శృంగేరి పీఠానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు పీఠాల మధ్య ఆధిపత్య పోరాటం పెరిగిపోయింది. ఫలితంగా ఏపీ దేవాలయాల్లో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు శ్రీశైలం మల్లన్నకు జరగాల్సిన మహా కుంభాభిషేకం ఆగిపోయింది. దీనికి ఎండలను కారణంగా చెబుతున్నా అసలు విషయం శృంగేరి పీఠానికి , శారదా పీఠానికి మధ్య వచ్చిన తేడాలే. శ్రీశైలం దేవస్థానంలో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరపాలన్నా, మార్పు చేర్పులు చేయాలన్నా శృంగేరీ పీఠాన్నే సంప్రదిస్తారు. కానీ ఈ సారి శ్రీశైలం మహా కుంభాభిషేకాన్ని తామే నిర్వహిస్తామంటూ విశాఖ పీఠం ముందుకొచ్చింది. ప్రభుత్వ పెద్దలు .. స్వరూపానంద అడిగితే కాదనలేకపోయారు. ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు జరపాలంటూ స్వామీజీ ముహూర్తం పెట్టారు. వెంటనే ఆలయ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ శ మహాకుంభాభిషేకానికి విశాఖ శారదా పీఠం పెట్టిన ముహూర్తం సరైనది కాదని పండితులు తేల్చడంతో అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
శ్రీశైలంలో పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహించాలి. ఐదేళ్ల క్రితం మహాకుంభాభిషేకం నిర్వహణకు సిద్ధం అయ్యారు. కానీ… అప్పుడు కూడా అయ్యవారి, అమ్మవారి అర్చకుల మధ్య విభేదాలతో అది ఆగిపోయింది. ఇప్పుడు కుంభాభిషేకాన్ని కార్తీక మాసంలో నిర్వహిస్తామని ప్రకటించారు. కుంభాభిషేకానికి రూ.6 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు రూ.2.50 కోట్లు వివిధ ఏర్పాట్ల కోసం ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కార్యక్రమం మొత్తం వాయిదా పడింది. పీఠాల మధ్య పంచాయతీ తీర్చిన తర్వాత మహా కుంభాభిషేకం జరుగుతుందని భావిస్తున్నారు.