లవ్ స్టోరీలోని `సారంగ దరియా` పాట యూ ట్యూబ్ లో ఎంత హల్ చల్ చేసిందో, ఛానళ్లలోనూ… అంతే వేడి రగిల్చింది. ఈ పాట విషయంలో తనకు అన్యాయం జరిగిందని జానపద గాయని కోమలి ఆవేదన వ్యక్తం చేయడం, కొన్ని టీవీ ఛానళ్ల అతి చొరవతో… ఈ వివాదం ముదరడం తెలిసిన విషయాలే. ఇప్పుడు దీనికి పుల్ స్టాప్ పడింది. `సారంగ దరియా` పాట విషయంలో ఇప్పుడు తనకెలాంటి అభ్యంతరమూ లేదని కోమలి స్పష్టం చేసింది. కోమలిని శాంతపరిచేందుకు `లవ్ స్టోరీ` టీమ్ చేసిన ప్రయత్నాలు.. ఎట్టకేలకు ఫలించాయి. తన తదుపరి సినిమాలో కోమలికి పాట పాడే అవకాశం ఇస్తానని.. శేఖర్ కమ్ముల మాట ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అంతేకాదు.. `లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో `సారంగ దరియా` పాటని కోమలితోనే పాడిస్తామని చిత్రబృందం చెబుతోంది. దాంతో.. కోమలి హ్యాపీ. ఈ వివాదానికి స్వస్తి పలికినట్టైంది.
`సారంగదరియా` అనే జానపద గీతం రేలారే రేలా పోగ్రాం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటని కోమలినే పాడింది. అదే పాటకి కొత్త హంగులు జోడించి `లవ్ స్టోరీ` కోసం వాడుకున్నారు. ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. దాంతో `ఆ పాటనాతో ఎందుకు పాడించలేదు` అని కోమలి అలిగింది. మీడియా ఈ విషయంలో కోమలిని సపోర్ట్ చేయడంతో.. అసలు పాటపై ఎవరికి హక్కు ఉంది? అనే పాయింట్ పై బాగా చర్చ జరిగింది. ఇప్పుడు `లవ్ స్టోరీ` చిత్రబృందం, దర్శకుడు శేఖర్ కమ్ముల చొరవ చూపించడంతో… కోమలి శాంతించింది. వివాదానికి పుల్ స్టాప్ పడింది.