లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లకు ఓ హైప్ తెచ్చిన పాట `సారంగ దరియా`. ఇందులో… సాయి పల్లవి వేసిన స్టెప్పులు, ఆ పాట పాడిన విధానం… బీటూ – పాటని ఒక్కసారిగా జనంలోకి తీసుకెళ్లిపోయాయి. ఏ ముహూర్తాన బయటకు వచ్చిందో గానీ, అప్పటి నుంచీ రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. యూ ట్యూబ్లో రోజుకో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 100 మిలియన్ల మైలురాయిని అతి వేగంగా అందుకున్న పాటగా మిగిలిపోయింది.
నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల దర్శకుడు. సుద్దాల అశోక్ తేజ రాసిన `సారంగ దరియా` ఎంత క్రేజ్ తెచ్చుకుందో, అన్ని వివాదాలకూ కారణమైంది. చివరికి… అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ఆ మచ్చ కూడా తొలగిపోయింది. `ఫిదా`లో వచ్చిండే – పాట ఆ సినిమాని మళ్లీ మళ్లీ చూసేలా, ఆ సినిమా గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకునేలా చేసింది. అంత దమ్ము ఈ పాటలోనూ ఉంది. ఆ మాటకొస్తే.. ఇంకాస్త ఎక్కువే కనిపిస్తోంది. లిరికల్ వీడియోకే ఇంత మైలేజీ వస్తే.. ఇక పాట మొత్తం బయటకు వస్తే ఎలా ఉంటుందో?