Sarangapani Jathakam movie review
రేటింగ్: 2.75/5
ఇంద్రగంటి మోహనకృష్ణ… తెలుగు చిత్రసీమలో అతికొద్ది మంది సెన్సిబుల్ డైరెక్టర్లలో ఒకరు. ఆయన సినిమాలు హిట్లవ్వొచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ ఆ సెన్సిబులిటీ మాత్రం వదల్లేదు. సున్నితమైన వినోదంతో చక్కలిగింతలు పెట్టే స్కిల్… ఆయనకు వుంది. క్లీన్ కామెడీ, ‘యూ’ సర్టిఫికెట్ లాంటి కుటుంబ కథా చిత్రాలు అందించగల నేర్పరి. అందుకే ఆయన్నుంచి ఓ సినిమా వస్తోందంటే ఓ వర్గం అలెర్ట్ అవుతుంది. ముఖ్యంగా… మల్టీప్లెక్స్ ఆడియన్స్. ఈసారి ఇంద్రగంటి ‘సారంగపాణి జాతకం’ అనే సినిమాతో వచ్చారు. ప్రియదర్శి హీరో. సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ రిలీజ్ కోసం చాలా కాలం ఆగాల్సివచ్చింది. మరింతకీ సారంగపాణి ఎలా ఉన్నాడు? తన జాతకం ఎలా వుంది?
సారంగపాణి (ప్రియదర్శి)కి చిన్నప్పటి నుంచీ జాతకాల పిచ్చి. రాశిఫలాలు చూడనిదే తన డే స్టార్ట్ అవ్వదు. ఓ షోరూమ్‌లో సేల్స్‌మెన్ గా పని చేస్తుంటాడు. అక్కడే మేనేజర్ గా వర్క్ చేస్తున్న మైథిలి (రూప)ని ప్రేమిస్తాడు. తన ప్రేమ వ్యక్తం చేసేలోపే.. మైథిలి సారంగపాణికి ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తుంది. నిశ్చితార్థం జరిగిపోతుంది. ఇక పెళ్లే తరువాయి. ఈలోగా సారంగపాణికి తన జాతకంలో ఓ లూప్ హోల్ గురించి తెలుస్తుంది. తన జీవితంలో ఒకర్ని హత్య చేయడం ఖాయమని చేతిలోని రేఖలు ఘోషిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తనో మర్డరర్‌గా మారడం ఖాయం.. అని ఓ జ్యోతిష్యుడు (అవసరాల శ్రీనివాస్) తేల్చి చెప్పడంతో.. అవాక్కవుడతాడు సారంగపాణి. అప్పుడు సారంగపాణి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? తన స్నేహితుడు చందు (వెన్నెల కిషోర్)తో కలిసి ఎలాంటి వ్యూహ రచన చేశాడు? అనేదే మిగిలిన కథ.
హీరోకి జాతకాల పిచ్చి ఉండడం అనేది ఓల్డ్ కాన్సెప్ట్. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాల్లో ఈ జాతకాలు, దాని చుట్టూ తిరిగే కామెడీతో ఈవీవీ చెడుగుడు ఆడేశారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ పట్టుకొన్న ఇంద్రగంటి కథని `హత్య` అనే కోణం వైపు నడిపించి ఈ కాన్సెప్ట్ కి ఓ కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కథని చాలా సింపుల్ గా ప్రారంభించిన ఇంద్రగంటి, లవ్ స్టోరీని త్వరగా తేల్చేసి, మెయిన్ స్ట్రీమ్‌లోకి వెళ్లిపోయారు. అవసరాల శ్రీనివాస్ ఎంట్రీతో.. కథలో తొలి మలుపు ఎదురవుతుంది. ‘నీ జాతకంలో నువ్వో మర్డర్ చేస్తావోయ్’ అని జ్యోతిష్యుడు చెబితే… ‘ఎలాగూ హత్య చేయడం ఖాయం. ఆ హత్యని చాలా సింపుల్ గా ఎవరికీ తెలియకుండా చేసేద్దాం’ అని హీరో డిసైడ్ అవ్వడం నిజానికి ఇల్లాజికల్ పాయింట్. కానీ దాన్ని ప్రేక్షకులు కన్వెన్స్ అయ్యేలా చేయగలిగారు ఇంద్రగంటి. ఇక్కడ ఆయనలోని రైటర్ బాగా హెల్ప్ అయ్యాడు. వెన్నెల కిషోర్ – ప్రియదర్శి మధ్య మర్డర్ గురించి జరిగిన డిస్కర్షన్ సీన్ దగ్గర మార్కులు కొట్టేశారు ఇంద్రగంటి. ఆ సీన్‌ని ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే.. కథలోని ఇల్లాజికల్ పాయింట్ ని సైతం పక్కన పెట్టేసి, ఆ రెండు క్యారెక్టర్స్‌ని ఫాలో అయిపోతారు. ఈ సీన్ ఏమాత్రం పండకపోయినా, ఆ తరవాత జరిగే కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. దాంతో సినిమా మొత్తం బెడసి కొడుతుంది. ఆ ప్రమాదం రాకుండా ఇంద్రగంటి జాగ్రత్త పడ్డారు. ముసలమ్మని మర్డర్ చేసే ప్రయత్నం, ఆ తరవాత బాస్ పై చేసిన ‘పెర్ఫ్యూమ్’ ప్లానింగ్ బాగా వర్కవుట్ అయ్యాయి. సన్నివేశాల్లో లాజిక్ లేనప్పుడు కామెడీతో మేకప్ చేయాలి. ఇంద్రగంటి చేసింది అదే. దాంతో.. కథలోని లోటు పాట్లు కళ్లకు కనిపించకుండా పోతాయి.
నిజానికి ఇలాంటి సినిమాలకు సెకండాఫ్ ఫోబియా ఉంటుంది. ఇంట్రవెల్ తరవాత కథని ఎలా నడపాలో అర్థం కాక చేతులు ఎత్తేస్తారు. కానీ ఇంద్రగంటి కాస్త బెటర్‌గా మేనేజ్ చేయగలిగారు. సెకండాఫ్‌లో హర్ష క్యారెక్టర్ ని తీసుకొని రావడం ఓ ప్లస్ పాయింట్ గా మారింది. తనని బాగా వాడుకొన్నారు. సెకండాఫ్‌లో దాదాపు సగం సినిమా ఓ హోటెల్ లోనే నడిచిపోతుంది. ఇలాంటి చోట దర్శకులు ఈజీగా దొరికిపోతారు. కానీ.. అక్కడ కూడా ఇంద్రగంటిలోని దర్శకుడ్ని, ఇంద్రగంటిలోని రైటర్ కాపాడగలిగాడు. క్లైమాక్స్ లో గాల్లో వేలాడుతూ భరణి, అవసరాల, ప్రియదర్శి మధ్య నడిచిన డైలాగ్ కామెడీ రక్తి కట్టింది. అలా మొత్తానికి ‘సారంగపాణి’ సేఫ్ జోన్లో పడిపోయాడు.
ప్రియదర్శికి టేలర్ మేడ్ పాత్ర ఇది. ఆడుతూ పాడుతూ చేసేశాడు. హీరోగా నిలదొక్కుకోవాలంటే కథల సెలక్షన్ చాలా అవసరం. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు.. ఇలాంటి కథలు ఎంచుకొంటే హీరోగానూ తనకు ఢోకా ఉండదు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ సెకండ్ హీరో అనుకోవాలి. తన కామెడీ టైమింగ్ చాలా ప్లస్ అయ్యింది. చిన్న చిన్న డైలాగులు కూడా వెన్నెల కిషోర్ వల్ల బాగా పేలాయి. చాలాచోట్ల ప్రియదర్శిని వెన్నెల కిషోర్ డామినేట్ చేసుకొంటూ వెళ్లిపోయాడు. సెకండాఫ్‌లో వచ్చే హర్ష కూడా బాగా నవ్వించాడు. ఈమధ్య కాలంలో హర్ష నుంచి వచ్చిన మంచి పాత్రల్లో ఇదొకటి. అవసరాల గెటప్ భిన్నంగా వుంది. తను కూడా ప్లస్ అయ్యాడు. కథానాయిక రూప సహజంగా కనిపించింది. రెగ్యులర్ హీరోయిన్ కటౌట్ అయితే కాదు. కానీ.. ఇలాంటి కథలకు యాప్ట్.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది రైటర్ సినిమా. ఇంద్రగంటి మాటల మాయ తెరపై కనిపిస్తుంది. ‘పినాకినీ’ పేరుని ‘పీనేకే పానీ’గా మార్చడం భలే అనిపించింది. కరెంట్ ఎఫైర్స్ ని పట్టుకొని దాని చుట్టూ కామెడీ రాయడం చాలా అరుదుగా కనిపించే విషయం. ఈ సినిమాలో అది వర్కవుట్ అయ్యింది. కాకపోతే డైలాగుల మధ్య అండర్ లైన్‌గా వినిపించే విషయాల్ని ప్రేక్షకులు పట్టుకోగలగాలి. అప్పుడు ఆ సంభాషణల్ని మరింత ఎంజాయ్ చేయొచ్చు. సెట్యువేషనల్ కామెడీ, డైలాగ్ కామెడీ రెండూ పోటీ పడ్డాయి. వివేక్ సాగర్ సంగీతం వినసొంపుగా వుంది. ఆర్.ఆర్ కూడా హాయిగా సాగుతుంది. మేకింగ్ విషయంలో మరీ హడావుడి కనిపించదు. కథకు ఏం కావాలో.. అదే తెరపైకి తీసుకొచ్చారు.
స్వచ్ఛమైన వినోదాలకు కరవొచ్చిన కాలం ఇది. ఇలాంటి సమయంలో… హాయిగా రెండు గంటల పాటు కాలక్షేపం కలిగించే సినిమా ‘సారంగపాణి జాతకం’.
రేటింగ్: 2.75/5