మంచి హ్యుమర్ టచ్ వున్న క్లాస్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. తన ఇమేజ్ కి తగ్గ పాత్రలతో అలరించే నటుడు ప్రియదర్శి. ఎన్నో మరపురాని సినిమాలని అందించిన సంస్థ శ్రీదేవి మూవీస్. ఈ ముగ్గురు కలసి ‘సారంగపాణి జాతకం’ సినిమాతో రాబోతున్నారు. తాజాగా టీజర్ ని వదిలారు. ఇంద్రగంటి మార్క్ లో లైటర్ వెయిన్ ఎంటర్ టైనర్ అనిపించింది టీజర్.
సారంగపాణి(ప్రియదర్శి)కి జాతకాల పిచ్చి. జీవితం మొత్తం హస్తరేఖల్లో రాసి ఉంటుందని నమ్మే మనిషి. పొద్దున్న పేపర్ లో రాశి ఫలాలు చూసి అదే నిజమౌతుందేమో అతిగా అలోచిస్తుంటాడు. ఆ ఆలోచనలు పీడ కలలుగా కూడా వస్తుంటాయి. తనో మర్డర్ చేసినట్లు పదేపదే ఉలిక్కిపడుతుంటాడు. ఇలా సారంగపాణి క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ తన చుట్టూ వుండే పాత్రలని హిలేరియస్ గా చూపిస్తూ టీజర్ ని కట్ చేశారు.
అవసరాల, వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు గమ్మత్తుగా వున్నాయి. తనికెళ్ళ భరణి పాత్ర డ్రామాని మలుపు తిప్పేలా వుంది. జాతకాల పిచ్చి నేపధ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఇంద్రగంటి ఎత్తుకున్న పాయింట్ లో కొత్త ట్రీట్మెంట్ కనిపించింది. కథని పూర్తిగా రివిల్ చేయకుండా కొంత సస్పెన్స్ కొనసాగించారు. ప్రియదర్శి, ఇంద్రగంటి గత సినిమాలు నిరాశ పరిచాయి. ‘సారంగపాణి’ ఖచ్చితంగా వారి జాతకం మార్చే సినిమా కావాలి.