బాహుబలి లో కట్టప్ప పాత్ర చాలా కీలకం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?? అనేదే పార్ట్ 2 చూడాలన్న ఉత్సాహానికి బీజం వేసింది. అలాంటి కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటన, ఆ గెటప్… చూడ ముచ్చటగా కుదిరిపోయాయి. నిజానికి ఈ పాత్ర కోసం ముందు చాలా రకాల పేర్లు అనుకొన్నార్ట. ఓ దశలో శరత్‌కుమార్ ని తీసుకొందాం అనుకొన్నార్ట. అయితే.. శరత్ కుమార్ సకాలంలో స్పందించకపోవడం వల్ల.. ఈ ఛాన్స్ మిస్సయ్యిందని తెలుస్తోంది. ఇటీవల శరత్ కుమార్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా బాహుబలిలో అవకాశం వదులుకొన్న సంగతి గుర్తు చేసుకొన్నాడు.
బాహుబలికి తనని పిలిచిన మాట వాస్తవం అని, అయితే.. తాను స్పందించేలోగా ఆ పాత్ర మరొకరికి వెళ్లిపోయిందని, తన పీఆర్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఆ సినిమా ఛాన్స్ చేజారిందని తెగ ఫీలవుతున్నాడు శరత్‌కుమార్. అంతేకాదు.. ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందుతున్న 16 సినిమాలో రెహమాన్ పాత్ర ముందు శరత్ కుమార్‌కే వచ్చిందట. అయితే.. అది కూడా వదులుకోవాల్సివచ్చిందని చెబుతున్నాడు ఈ యాక్షన్ హీరో. పీఆర్ లు సకాలంలో స్పందించకపోతే.. ఇలాంటి అరుదైన అవకాశాలే చేజారిపోతాయి. ఇప్పటికైనా ఈ విషయంలో శరత్ కుమార్ జాగ్రత్త పడతాడో లేదో చూడాలి.