తమిళనాడులో జల్లికట్టు రచ్చ జరుగుతోంది. జల్లికట్టుకి అనుకూలంగా పలువురు అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నో చెప్పినప్పటికీ, కొంతమంది నాయకులు,ప్రముఖులు సంప్రదాయ క్రీడ జల్లికట్టుని నిషేధించడం తగదంటూ భహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు క్రమంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ముఖ్యంగా ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ను కార్నర్ చేయడానికి పెద్ద స్కెచ్ వేశారు హీరో,అన్నాడిఎంకె నేత శరత్ కుమార్.
రజనీకాంత్ జల్లికట్టుకు అనుకూలంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును ఆడాల్సిందేనని, ఎన్నో శతాబ్దాలుగా జల్లికట్టు ఆట ఉందని,తమిళుల సంస్కృతిలో భాగంగా దాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పుకొచ్చారాయన. అయితే ఇప్పుడు రజనీ మాటలను రాజకీయం చేసేశారు శరత్ కుమార్. అసలు రజనీకి జల్లికట్టు గురించి మాట్లాడే అర్హత లేదని, రజనీ తమిళుడు కాదని,వలస వచ్చిన వారు జల్లికట్టు గురించి మాట్లాడటం హాస్యస్పదమని ఓ వివాదస్పద ప్రకటన చేశారు శరత్ కుమార్. అంతేకాదు.. రజనీ భవిష్యత్ లో రాజకీయాల్లోకి అడుగుపెడితే అతన్ని అడ్డుకునే వారిలో నేనే మొదటి వాడనని, పుట్టుకతో మరాఠి అయిన రజనీ తమిళరాకీయలు ఎలా చేస్తారాని ఓ సంచలన ప్రకటన చేసిపారేశారు శరత్ కుమార్.
ఇప్పుడు శరత్ కుమార్ మాటలు అక్కడ హాట్ టాపిక్ గా మారాయి. రజనీ కాంత్ ఫ్యాన్స్ అయితే శరత్ కుమార్ దిష్టి బొమ్మలను కాల్చిపారేశారు. నిరసనలు సంగతి పక్కన పెడితే.. శరత్ కుమార్ సంచలన మాటలు పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయని చెప్పొచ్చు. ఆయన పలికినవి కాదు. ఆయన చేత పలికించిననవని అర్ధమౌతుంది. త్వరలో రజనీ రాజకీయ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రజనీ ‘స్థానికత’ తెరపైకి తీసుకు రావడం పెద్ద రాజకీయ ఎత్తుగడ. స్థానికతను రాజకీయం చేస్తే రిజల్ట్ ఎలా వుటుందో డోనాల్డ్ ట్రంప్ చేసి చూపించాడు. ‘స్థానికత’ అడ్డుపెట్టుకొని ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఇదే ఫార్ములను రజనీ కాంత్ విషయంలో ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లు వున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. అసలే అరవ జనాలకి స్థానికత, భాష అభిమానాలు ఎక్కువ. ఇప్పుడు రజనీ కాంత్ ను స్థానికత విషయంలో కార్నర్ చేయాలని వ్యూహాలను రచించడం మొదలుపెట్టారు ఆయనకు గిట్టనివారు. మొత్తంమ్మీద.. ఒకవేళ రజనీ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ని ఇరుకున పెట్టె ఓ అస్త్రం అయితే దొరికింది అక్కడి రాజకీయ పార్టీలకు.