సర్దార్ గబ్బర్ సింగ్ వివాదం ఇంకా సమసిపోలేదు. సర్దార్ వల్ల నష్టపోయిన పంపిణీదారులంతా ఇప్పుడు.. కాటమరాయుడు విడుదలకు మోకాలడ్డేలా ఉన్నారు. సర్దార్ వల్ల నష్టపోయిన పంపిణీదారులకు కాటమరాయుడు సినిమా ఇచ్చి ఆదుకొంటానని పవన్ మాటిచ్చాడు. అయితే… పవన్ చెప్పింది వేరు. జరిగింది వేరు. సర్దార్ కొన్న ఏ ఒక్కరికీ కాటమరాయుడు అమ్మలేదు. అందుకే కొంతమంది మీడియా ముందుకొచ్చి తన గోడు చెప్పుకొన్నారు. శరత్ మరార్, పవన్ మేనేజర్ ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని, పవన్ తమని ఆదుకోవాలని విన్నవించుకొన్నారు. అయితే… అదేం వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు వాళ్లంతా నిరాహార దీక్షకు పూనుకొన్నారు. ఇది నిజంగా పవన్‌కి తలనొప్పి వ్యవహారమే. కాటమరాయుడు విడుదలకు పది రోజులకు మించి టైమ్ లేదు. ఈదశలో ఇలాంటి వివాదాలు రేకెత్తడం మంచి పరిణామం కాదు.
పవన్ నిజాయతీ గురించి గొప్పగా చెప్పుకొనే అభిమానులకూ ఇది మింగుడు పడని విషయం. తన ముందే ఇంత అన్యాయం జరుగుతోంటే, పవన్ ఎందుకు మాట్లాడడం లేదు అని యాంటీ పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే రెచ్చిపోతున్నారు. విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం పవన్‌కి లేకపోవొచ్చు. కానీ.. కనీసం తనని నమ్ముకొని సినిమా కొని నష్టపోయినవాళ్లకైనా పవన్ సమాధానం చెప్పి తీరాలి. రోడ్డెక్కిన సర్దార్ బాధితులకు తన తరపున స్పష్టమైన హామీ ఇవ్వాలి. కనీసం శరత్ మరార్ అయినా… దీనికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. లేదంటే ఈ వివాదం మరింత ముదిరే ఛాన్స్ ఉంది.