పవన్ కల్యాణ్ సినిమా వస్తోందంటే.. ఫ్యాన్స్‌కి పండగే. పవన్ విన్యాసాల్ని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. పవన్ సినిమా తొలి రోజు, తొలి ఆట చూసేస్తే… అందులో వచ్చే కిక్కే వేరప్పా.. – అన్నది పవర్ స్టార్స్ ఫ్యాన్స్ మాట. అర్థరాత్రి వేసే బెనిఫిట్ షోల కోసం కూడా క్యూలుకట్టేస్తారు. ఇప్పుడు ఈ క్రేజ్‌ని సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అగ్ర కథానాయకుల చిత్రాలకు బెనిఫిట్ షోలు వేసే సంప్రదాయాన్ని సర్దార్ టీమ్ కూడా కొనసాగిస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఎనిమిది థియేటర్లలో ఈ సినిమా స్పెషల్ స్ర్కినింగ్ వేయాలని సర్దార్ టీమ్ ఆలోచన. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర్రాల్లో ఉదయం ఆరు గంటలకు షోలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ప్రదర్శించే బెనిఫిట్ షోల ద్వారా కనీసం రూ.50 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది చిత్రబృందం ఆలోచన. అందుకే.. షో నిర్వాహకులకు భారీ రేట్లు చెబుతున్నార్ట. సాధారణంగా అగ్ర కథానాయకుడి చిత్రం బెనిఫిట్ షో అంటే టికెట్ రూ.500 నుంచి రూ.1000 వరకూ పలుకుతుంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలంటే వేయి రూపాయలు ఉండాల్సిందే. అయితే సర్దార్కి ఈ టికెట్ రేటు డబుల్ చేసే ఆలోచనలో ఉన్నార్ట. రూ.2వేలకు బెనిఫిట్ షో టికెట్ అమ్మాలనిచూస్తున్నారు. ఆ లెక్కన భారీ మొత్తాన్ని బెనిఫిట్ షోల ద్వారానే ఆర్జించొచ్చన్నది టీమ్ ఆలోచన. తొలి మూడు రోజుల వసూళ్లలో ఈ బెనిఫిట్ షోల ఆదాయం కూడా కలుస్తుంది. రికార్డు వసూళ్లు చూపించుకోవాలంటే.. ఇలాంటి ట్రిక్కులు తప్పవేమో మరి. రూ.2000 టికెట్ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ముందుకొస్తారన్నది ప్రశ్న. అరివీర భయంకర ఫ్యాన్స్ అయితే టికెట్ కొనేస్తారు. మరి మిగిలినవాళ్ల మాటేంటి?? సర్దార్ ఈ విషయాన్ని ఆలోచించడా??