‘ప్రశ్నించడం మీ హక్కు’ అంటూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా డైలాగు రూపంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక కిక్ అందించాడు గతంలో. ఆ తర్వాత ‘ప్రశ్నించడం మీ హక్కు’ అంటూ దాన్ని సాధించడానికే అన్నట్లుగా తన జనసేన పార్టీని స్థాపించాడు పవన్ కల్యాణ్. తాను “ఎవ్వరినైనా సరే ప్రశ్నించేస్తా” అని ఆయన రాజకీయ ప్రసంగాలు చేసిన ప్రతి సందర్భంలోనూ సెలవిస్తూ ఉంటారు. అన్నింటి సంగతి ఏమో గానీ.. మొత్తానికి తాజాగా తాను హీరోగా విడుదలకు సిద్ధం అవుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం ట్రైలర్లో అభిమానుల్ని మాత్రం ప్రశ్నిస్తున్నాడు పవన్‌కల్యాణ్. ‘ఏయ్… పేరు గుర్తుంది కదా…’ అని ప్రశ్నిస్తాడు పవర్‌స్టార్ ట్రైలర్ చివర్లో! ఎవరు మరచిపోగలరు. సుమారు ఏడాదికి పైగా కాలంనుంచి దీనికోసం అభిమానప్రపంచం మరియు తెలుగు సినీ అభిమానులు మొత్తం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ పేరును అంత సులభంగా ఎందుకు మరచిపోతారు ?. కానీ ట్రైలర్ చివర్లో ప్రేక్షకులకు మరింత క్లారిటీ ఇవ్వడం కోసం పవన్‌కల్యాణ్ ఈ ప్రశ్నను సంధిస్తారు. మళ్లీ తనే సమాధానం కూడా చెప్తారు. “గబ్బర్‌సింగ్.. సర్దార్ గబ్బర్‌సింగ్” అంటూ వివరణ ఇస్తారు.
ట్రైలర్ రివ్యూ :
సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. ఏకవాక్యంలో చెప్పాలంటే ఈ ట్రైలర్ మెగా అభిమానులకు కిక్ ఎక్కించే స్థాయిలో ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా పెద్దహీరోల చిత్రాల ట్రైలర్లు అన్నీ ఆద్యంతం ఆ హీరో మీదనే ఫోకస్ చేస్తూ ఉంటాయి. కానీ, ట్రైలర్లో పవన్‌కల్యాణ్ మూడో వంతు సమయం మాత్రమే కనిపిస్తారు. కానీ ట్రైలర్ “ఎంత సమయం కనిపించాం అనేది కాదు అన్నయ్యా ! అభిమానులకు ఎంత కిక్ ఇచ్చాం అనేది ముఖ్యం ” అన్న తరహాలో ఈ ట్రైలర్ సాగుతుంది.
ట్రైలర్‌ను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించాలి. ఒకటి విలన్, రెండు- హీరోయిన్, మూడు- హీరో! తొలి భాగంలో విలన్ సామ్రాజ్యం ఎలాంటిది , అక్కడ విలన్ ఎంత క్రూరుడు, దుర్మార్గుడు అనేది ఇందులో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంత అందగత్తె, ఎంత మంచి అమ్మాయి అనేది ఎస్లాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత ఒక హీరో కోసం అక్కడి జనం ఎంతగా పరితపించిపోతున్నారో తెలుస్తుంది. చివరికి హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఉండేలా ట్రైలర్‌ను రూపొందించారు.
గబ్బర్‌సింగ్ కు పార్ట్-2 గా పవన్ చిత్రానికి రూపకల్పన చేశాడని తెలిసిన దగ్గరినుంచి చాలా ఆశగా ఎదురుచూస్తున్న మెగా అభిమాన ప్రపంచానికి ఇది చాలా ఇంటరెస్టింగ్ ట్రైలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తున్నంత సేపు ‘సినిమా చూసినంత’ ఆనందంగా చాలా ఆసక్తికరంగానే ఉన్నది గానీ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఒక రకమైన అసంతృప్తి కలుగుతుంది. సినిమా ట్రైలర్ అంటే వంటకానికి సంబంధించి వాసన మాత్రం చూపించి ఎప్పుడెప్పుడు రుచి చూద్దామా అనే కోరిక పుట్టించేలా ఉండాలి. కానీ ఈ ట్రైలర్ రుచి కూడా చూపించేసినట్లే ఉంటుంది. అంటే పిడికిలి తెరిచేస్తే ఎలా సస్పెన్స్ ఉండదో ఈ ట్రైలర్ కూడా అలా ఉంటుంది.
సుమారు మూడు నిమిషాల ట్రైలర్‌ను రూపొందించారు. అందులో సినిమాకు సంబంధించిన చాలా విషయాలను చెప్పడానికి ప్రయత్నించారు. ట్రైలర్‌ను ఇలా అనుభవరాహిత్యంతో కట్ చేశారేమిటా? అని సందేహం కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సినిమా ట్రైలర్ అంటే అది సినిమా కోసం ఎదురుచూడాలనే ఫీలింగ్‌ను పుట్టించాలి. కానీ ఈ ట్రైలర్ మాత్రం అలా లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. సినిమా ట్రైలర్ చూడడం అంటే ‘సినిమాలో ఏదో ఉంది’ అనే ఫీలింగ్ కలిగించాలి. అంతే తప్ప ‘సినిమాలో ఏం ఉన్నదో’ ముడివిప్పి చెప్పకూడదు. ఆ తప్పిదాన్ని ఈ ట్రైలర్లో చేసినట్లుగా అనిపిస్తుంది. జస్ట్ ఈ ట్రైలర్ ద్వారా సినిమా కథ మొత్తం తెలిసిపోతుంది.
సాధారణ ప్రేక్షకులకి రొటీన్ సినిమాగా , అభిమానులకి పండుగ వాతావరణం లాగా అనిపించేట్టు ఉన్న ఈ ట్రైలర్ డిస్టింక్షన్ని దూరంగా మిస్ అయ్యి, పాస్ మార్కులకి ఎక్కువగా , ఫస్ట్ క్లాస్ కి దగ్గర్లో ఆగిపోయింది అని చెప్పొచ్చు. అయితే గబ్బర్ సింగ్ లాంటి సాధారణ సినిమాని పెద్ధ హిట్ చేసిన పవన్ ఎనర్జి , మానరిజంస్ మరియు క్రేజ్ ని బట్టి చూస్తే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అటు ఇటుగా అంతే స్థాయిలో హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి.