నా సినిమా పోయింది.. డబ్బులు లాస్… అని ఏ హీరో అయినా చెప్తాడా? అదీ సినిమా విడుదలైన మూడో రోజే. మిగిలిన హీరోల మాటేమో గానీ.. పవన్ మాత్రం ధైర్యంగా చెప్పగలిగాడు.. అదీ పవన్ కల్యాణ్ గట్స్ అంటే. సర్దార్ వల్ల నిర్మాత శరత్ మరార్ భారీగా నష్టపోయారని క్లియర్ కట్‌గా చెప్పేశాడు పవన్ కల్యాణ్. ”ఈ సినిమాకి భారీ ఎత్తున ఖర్చు పెట్టారు శరత్ మరార్. పెట్టుబడి పెరిగిపోయింది. అయితే చివర్లో ఈ సినిమాని తక్కువ రేటుకే ఇచ్చేశాం. దాంతో శరత్ నష్టపోయారు. ఆయన కోసం ఓ సినిమా చేయాలిప్పుడు” అన్నాడు పవన్ కల్యాణ్. పవన్ త్వరలోనే ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈనెలాఖరున ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలూ పవన్.. శరత్ మరార్కే అప్పగించారు. అలా.. నష్టాన్ని కొంతలో కొంత పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడటన్నమాట. ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమ కథ అని తెలుస్తోంది. లవ్, ఎమోషన్, యాక్షన్… పవన్ శైలి ఎంటర్టైన్ మెంట్ ఇవన్నీ కలగలిపి స్ర్కిప్టు తయారు చేశారట. సర్దార్ నష్టాన్ని ఈ ఫ్యాక్షనిస్టు ఎంత వరకూ భర్తీ చేస్తాడో చూడాలి.