రాజ్ కోట్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (131) రవింద్ర జడేజా (110 నాటౌట్) సెంచరీలు చేసినా… స్టార్ ఆఫ్ ది డే మాత్రం సర్ఫ్రాజ్ ఖాన్. తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సర్ఫ్రాజ్ దూకుడైన బ్యాటింగ్ తో ఆకట్టుకొన్నాడు. కేవలం 48 బంతుల్లోనే టెస్టుల్లో తన తొలి ఆఫ్ సెంచరీ సాధించి ఘనమైన అరంగేట్రం ఇచ్చాడు. చివరికి 62 పరుగుల వద్ద రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇక్కడ కూడా కేవలం రవీంద్ర జడేజాకు సెంచరీ అవకాశం ఇద్దామని తన వికెట్ ని త్యాగం చేశాడు. అప్పటికి జడేజా 99 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. జడేజా లేని పరుగు కోసం పిలవడంతో… సర్ఫ్రాజ్ ఇన్నింగ్స్ కు తెరపడినట్టైంది. మొత్తానికి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. క్రీజ్‌లో జడేజాతో పాటు కులదీప్ (1) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీసుకొన్నాడు. చాలాకాలంగా జట్టులో స్థానం కోసం సర్ఫ్రాజ్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఈ బ్యాటర్‌కు… ఇన్నాళ్లకు జాతీయ జట్టులో స్థానం దొరికింది. తొలి మ్యాచ్‌లోనే తన బ్యాటింగ్ తీరుతో అభిమానుల్లో సంపాదించుకొన్నాడు సర్ఫ్రాజ్. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకొన్న సంగతి తెలిసిందే.