బాక్సాఫీసు దగ్గర ‘రిలీజ్ డేట్’ గేమ్ మళ్లీ మొదలైంది. జనవరి 12నే వస్తాం అని పట్టుపట్టుకుని కూర్చున్న మహేష్, అల్లు అర్జున్‌లు కాస్త మనసు మార్చుకుని 11, 12 తేదీలు పంచుకున్నారు. మహేష్ సినిమా 11న, బన్నీ సినిమా 12న రావాలి. అంతా ఓకే అనుకున్ సమంయంలో ఇప్పుడు థియేటర్ల గేమ్ మొదలైంది. దాంతో బన్నీ ఇంకాస్త ముందుగా అంటే 10నే రావడానికి సిద్ధం అవుతున్నాడు. బన్నీ డేట్ మారిస్తే మేం ఎందుకు మార్చకూడదు అని మహేష్ టీమ్ అనుకుంటోంది. అల వైకుంఠపురం డేట్ ఏమాత్రం మారినా, తాము కూడా అనుకున్న సమయానికంటే ముందే వచ్చేయాలని సరిలేరు నీకెవ్వరు టీమ్ భావిస్తోంది. బన్నీ చెప్పడు… ఆయన చెప్పేంత వరకూ మహేష్ బయట పడడు. అంతే. వీరిద్దరూ డేట్లు చెప్పేంత వరకూ బయ్యర్ల బీపీ పెరుగుతూనే ఉంటుంది.
ప్రొడ్యూసర్ గ్రిల్డ్ మధ్యవర్తిత్వం మేర చేసుకున్న ఒప్పందాల ప్రకారం సరిలేరు నీకెవ్వరు 11న, అల వైకుంఠపురం 12న రావాలి. అయితే ఇప్పుడెందుకు ఈ డేట్ల విషయంలో ఇద్దరు నిర్మాతలూ అసంతృప్తిలోనే ఉన్నారు. ముఖ్యంగా థియేటర్ల సర్దుబాటు కావడం లేదు. 11న సరిలేరు నీకెవ్వరు వస్తే మొత్తం థియేటర్లన్నీ ఆ సినిమా చేతుల్లోకి వెళ్లిపోతాయి. అయితే 12న బన్నీ సినిమాకి కొన్ని థియేటర్లు తిరిగి ఇవ్వాలని, మరో రెండ్రోజుల తరవాత మొత్తం థియేటర్లని రెండు సినిమాలూ పంచుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని సరి లేరు నీకెవ్వరు మీరుతుందని గీతా ఆర్ట్స్ ఆరోపిస్తోంది. 12న అల వైకుంఠపురంకి థియేటర్లు ఇవ్వడానికి మహేష్ బృందం సిద్ధపడడం లేదని, పైగా `మాకు అల వైకుంఠపురమే` కావాలి అని అడగుతున్న థియేటర్లకు కూడా సరిలేరు నీకెవ్వరుని బలవంతంగా అంటగడుతున్నారని తెలుస్తోంది. `ఇప్పుడు మా సినిమా తీసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే సినిమాలు మీకిస్తాం` అని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేయడం కూడా జరుగుతోందని తెలుస్తోంది. నైజాంలో దిల్ రాజు చేతిలో ఎక్కువ థియేటర్లున్నాయి. ఏషియన్ వాళ్లు కూడా ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇవి రెండూ సరిలేరు నీకెవ్వరు సినిమానే మోయాలి. అలాంటప్పుడు నైజాంలో బన్నీ సినిమాకి థియేటర్లు దొరకవు. నైజాం మార్కెట్ ని వదులుకోవడం బన్నీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే 10న మన సినిమా విడుదల చేస్తే – నైజాంలో థియేటర్లు కూడా మన చేతిలో ఉంటాయని ఆలోచిస్తున్నాడు.
అటూ ఇటూ జరిగి అల వైకుంఠపురం 10నే వస్తే, ఆ రోజున గానీ, అంతకంటే ముందు అంటే 9న గానీ రావడానికి సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా సన్నాహాలు చేస్తోందని సమాచారం. అంటే రిలీజ్ డేట్ గ్యాంబ్లింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదన్నమాట. గీతా ఆర్ట్స్ ఇప్పుడు బయ్యర్లు, థియేటర్ల యాజమాన్యాలతో వాడీవేడిగా చర్చలు సాగిస్తోంది. చేతిలో ఎన్ని థియేటర్లున్నాయో చూసుకుని అప్పుడు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతోంది. ఆ తరవాత.. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్‌పై కూడా స్పష్టత వస్తుంది. ఇద్దరూ ఒకే డేట్ న వచ్చినా ఆశ్చర్యం లేదు.