సంక్రాంతి సీజన్ ముగిసిన వెంటనే, అందులోనూ సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో ఉండగానే ఓ సినిమా విడుదల చేయడం ఓరకంగా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే.. జనాలంతా సంక్రాంతి సినిమాల్ని వరుసగా చూసేసుంటారు. సినిమాల బడ్జెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మరో సినిమా అంటే… టాక్ తెలుసుకోకుండా బయటకు రారు. ఆ ఎఫెక్ట్ సంక్రాంతి తరవాత రాబోయే సినిమాలపై తప్పకుండా ఉంటుంది. డిస్కోరాజాకీ ఈ ఇబ్బంది ఉంది.
దాంతో పాటు థియేటర్ల ఇబ్బంది కూడా గట్టిగానే ఉంది. ఓ పక్క సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల్ని పోటా పోటీగా ఆడిస్తున్నారు. ఎక్కువ భాగం థియేటర్లు ఈ రెండు సినిమాల చేతుల్లోనే ఉన్నాయి. వాటి నుంచి థియేటర్లు రాబట్టుకోవడం ‘డిస్కోరాజా’కు కష్టంగా మారింది. సరిలేరు సినిమాకి 20 నుంచి 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. ఆ థియేటర్లన్నీ ‘డిస్కోరాజా’కి ఇవ్వొచ్చు. కానీ.. ఈ వీకెండ్ కూడా ఎన్నో కొన్ని వసూళ్లు వస్తాయేమో అని ‘సరిలేరు..’ ఎదురు చూస్తోంది. దాంతో వాళ్లు థియేటర్లు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. డిస్కోరాజా టాక్ బాగుండి, థియేటర్ యజమానులు ‘మాకు డిస్కోరాజానే కావాలి’ అని డిమాండ్ చేస్తే తప్ప- రవితేజ సినిమాకి కావల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉండకపోవొచ్చు.