‘హాయ్ నాన్న’ తరవాత నాని నుంచి వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. వారంలో మిగిలిన రోజులు అశక్తుడిగా ఉండి, శనివారం మాత్రం శక్తియుక్తులన్నీ కూడదీసుకొనే హీరో కథ ఇది. కాన్సెప్ట్ పరంగా వెరైటీగా ఉంది. దానికి నాని మార్క్ వినోదం తోడైతే, తన ఖాతాలో మరో హిట్ పడినట్టే. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ పాట బయటకు వచ్చింది.
‘గరమ్ గరమ్’ అనే ఈ పాటలో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పేశారు. ట్యూన్ ట్రెండీగా ఉంది. లిరిక్స్ లో హీరోయిజం కావల్సినంత ఎలివేట్ అవుతోంది. యాక్షన్ మోడ్‌లో వచ్చే పాటలో ఉంది. ఈ పాటలో ఓ చోట నాని వాయిస్ ఓవర్ ద్వారా నరకాసుర వధ కాన్సెప్ట్ ని రెండు ముక్కల్లో చెప్పేశాడు. దాంతో ఈ సినిమాకూ, నరకాసుర వధ కాన్సెప్ట్ కూ ఏదో లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ప్రియాంకా మోహన్ కథానాయిక. వివేక్ ఆత్రేయ కథలన్నీ క్లాస్‌గా ఉంటాయి. అయితే తొలిసారి మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని కూడా `హాయ్ నాన్న` తరవాత ఓ పర్ఫెక్ట్ మాస్ సినిమా తీసుకొద్దామనుకొన్నాడు. సరిపోదా శనివారంతో ఆ టార్గెట్ రీచ్ అవుతాడనే అనిపిస్తోంది.