ఆగస్టు బాక్సాఫీసు చివరి వీకెండ్ కి వచ్చేసింది. ఈ నెలలోనూ సరైన హిట్ లేదు. పంద్రాగస్ట్ సినిమాలు మంచి అంచనాలతో విడుదలయ్యాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో రంగంలో దిగారు. ఐతే ఈ రెండు సినిమాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. రీమేక్స్ తో మ్యాజిక్ చేసే హరీష్ శంకర్ బచ్చన్ విషయంలో పట్టుతప్పారు. బలహీనమైన కథ, కథనాలతో సినిమాని తీర్చిదిద్దిన తీరు నిరాశపరిచింది. ఇక డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి కూడా ఇదే. పూరి మరీ రొటీన్ గా ఈ సినిమాని తీశారు.
ఇక ఇదే వారంలో వచ్చిన విక్రమ్ తంగలాన్ విమర్శకుల ప్రసంశలు పొందినప్పటికీ అందులోని కథ, నేపధ్యం, చరిత్ర.. అందరికీ కనెక్ట్ అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా ఆయ్, అంతకుముందు వారం వచ్చిన కమిటీ కుర్రాళ్ళు మాత్రం బాగానే సందడి చేశారు. అయితే బాక్సాఫీసుకు ఈ ఊపు సరిపోదు. వసూళ్లతో మోతెక్కిపోయే ఓ హిట్ చాలా అవసరం. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఈనెల 29న వస్తున్న నాని సరిపోదా శనివారంపైనే వుంది. నాని కెరీర్ మంచి హిట్ ట్రాక్ లో వుంది. దసరా, హయ్ నాన్నలకి మంచి ఆదరణ దొరికింది. సరిపోదా శనివారం ప్రమోషనల్ కంటెంట్ కూడా క్యాచిగా వుంది. నానిని యాక్షన్ అవతార్ లో చూపించాడు వివేక్ ఆత్రేయ. క్రాఫ్ట్ మీద మంచి కమాండ్ వున్న డైరెక్టర్ తను. ఈసారి మాస్ పల్స్ పట్టుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడని అంటున్నారు. మంత్ ఎండ్ అదరగొట్టేస్తామని యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. సూర్య విలనిజం కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు కనిపిస్తోంది. ఆగస్ట్ కి బెస్ట్ ఫినిషింగ్ కావాలి. మరా ఫినిషింగ్ టచ్ నాని ఇస్తాడేమో చూడాలి.