saripodhaa sanivaaram movie telugu review
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్-
కాన్సెప్ట్ సినిమాలు వేరు, కమర్షియల్ సినిమాలు వేరు. కాన్సెప్ట్ ని నమ్మకొంటే కమర్షియాలిటీ ఉండదు. కమర్షియాలిటీనే కావాలనుకొంటే కాన్సెప్ట్ అవసరం ఉండదు. అయితే ఈ రెండింటినీ మేళవించినప్పుడు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఆ నమ్మకాన్ని కలిగించిన సినిమా… ‘సరిపోదా శనివారం’. నాని ఎంచుకొనే సినిమాల్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలే ఎక్కువ. తను కూడా మధ్యమధ్యలో కమర్షియల్ ప్రయత్నాలు చేశాడు. ఆ సినిమాలో కోసం కాన్సెప్ట్ ని పక్కన పెట్టి, పూర్తి కమర్షియల్ దారిలో మాత్రమే వెళ్లాడు. ఈసారి మాత్రం ఇవి రెండూ ఒకే కథలో బెండ్ అయ్యాయనిపించింది. మరి ‘సరిపోదా శనివారం’లో ఉన్న కాన్సెప్ట్, కమర్షియల్ విలువలేంటి? వాటి మేళవింపు ఎలా ఉంది?
సూర్య (నాని)కి చిన్నప్పటి నుంచీ కోపం ఎక్కువ. ప్రతీరోజూ గొడవే. అందుకే అమ్మ సూర్యతో ఓ ప్రామిస్ చేయించుకొంటుంది. ‘వారంలో శనివారం మాత్రమే నీది, ఆ రోజే నీ కోపం చూపించు. మిగిలిన రోజులు కామ్ గా ఉండు’ అని ఒట్టు వేయించుకొంటుంది. అందుకే సూర్య మిగిలిన రోజుల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంటాడు. శనివారం మాత్రం రెచ్చిపోతుంటాడు. తనకు ఎవరిపై కోపం ఉన్నా ఓ డైరీలో పేరు రాసుకోవడం, శనివారం వచ్చాక అతని అంతు చూడడం.. ఇదే సూర్య కాన్సెప్ట్. మరోవైపు దయానంద్ (ఎస్.జె.సూర్య) ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్. తన అన్నయ్య కూర్మానంద్ (మురళీ శర్మ)తో తనకు ఆస్తి గొడవలు. రూ.45 కోట్ల విలువైన ఆస్తి తనది కాకుండా చేసినందుకు అన్నయ్యపై కోపం, పగ పెంచుకొంటుంటాడు. ఎలాగైనా ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. తన కోపాన్ని `సోకుల పాలెం` అనే ఊరి వాళ్ల మీద చూపిస్తుంటాడు. కోపం వచ్చినప్పుడల్లా ఆ ఊరి జనాలపై పడి, చావగొడుతుంటాడు. అలాంటి పోలీస్ ఆఫీసర్ పేరు సూర్య తన డైరీలో రాసుకోవాల్సివస్తుంది. అదెలా జరిగింది? దయాపై సూర్య తన కోపాన్ని ఎలా తీర్చుకొన్నాడు? సోకుల పాలెం జనాలకు వచ్చిన సమస్య ఏమిటి? ఈ కథలో చారులత (ప్రియాంక అరుళ్ మోహన్) ఎవరు? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
ఓ ఊరు. దాన్నీ పీడించే ఓ రాక్షసుడిలాంటి విలన్. వాళ్లని కాపాడడానికి వచ్చిన ఓ హీరో. హీరో చేతుల్లో విలన్ ఛస్తాడు. ఆ ఊరు సంతోషిస్తుంది. ఇదే క్లుప్తంగా ‘సరిపోదా శనివారం’ కథ. నిజానికి ఇలాంటి కథలు చాలా చాలా వచ్చాయి. వస్తూనే ఉంటాయి కూడా. అయితే ఆ కథలకూ, ‘సరిపోదా..’కూ మధ్య ఉన్న వ్యత్యాసం.. కాన్సెప్ట్. హీరో పాత్రకు కోపం ఉండడం కూడా చాలా సినిమాల్లో చూశాం. అయితే ఆ కోపాన్ని ఒక్క రోజుకు పరిమితం చేయడం అనేది ఈ కథలో ఆసక్తిని కలిగించే అంశం. అయితే ఆ కాన్సెప్ట్ ఒక్కదాన్నే నమ్ముకొన్నా కూడా అది ‘సరిపోదా శనివారం’ అవ్వదు. ఎందుకంటే.. కాన్సెప్ట్ ఏమిటో తెలిసిపోయాక ఆ తరవాత సీన్లు రొటీన్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. కథ మళ్లీ పాత దారిలోనే నడుస్తుంది. అందుకే ఇక్కడ వివేక్ ఆత్రేయ ఓ తెలివైన పని చేశాడు. హీరో పాత్రని ఎంత కొత్తగా రాసుకొన్నాడో విలన్ పాత్రనీ అంతే ఆసక్తిగా తీర్చిదిద్దాడు. దయా అనే పాత్ర లేకపోతే…. ‘సరిపోదా’ సినిమా నిలబడలేదు. హీరో పాత్రని ఎంత ప్రేమించి రాసుకొన్నాడో, దయా పాత్ర కోసం కూడా దర్శకుడు అంతే తపన పడ్డాడనిపిస్తుంది. అందుకే ఆ రెండు పాత్రలూ తెరపై నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఆ డ్రామా రక్తి కట్టింది. వివేక్ ఆత్రేయ చిన్న చిన్న విషయాల్లో చూపించిన డీటైలింగ్ ముచ్చట గొలుపుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో అది ప్రధాన భాగమైపోయింది.
సినిమా ప్రారంభంలోనే హీరోయిజం చూపించడానికి ‘పది నిమిషాలు’ అనే ఓ సీన్ రాసుకొన్నాడు దర్శకుడు. ఆ తరవాత స్క్రీన్ ప్లేలో దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు. ఇదొక్కటే కాదు. ఇలాంటి చాలా గమ్మత్తులు కనిపిస్తాయి. కూర్మానంద్ (మురళీ శర్మ) ది మరో టైపు పాత్ర. ‘రాంగ్ జడ్జిమెంట్’తో సతమతమయ్యే క్యారెక్టర్. అతని జడ్జిమెంట్ ఎంత రాంగ్ గా ఉంటుందో తన పరిచయ సన్నివేశంలో చూపించి, ఆ తరవాత కథకు ఎక్కడ అవసరమో అక్కడ మళ్లీ దాన్ని వాడుకొన్నాడు. దాని వల్ల స్క్రీన్ ప్లేలో కొత్తదనం వచ్చింది. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు.
నాని ఛైల్డ్ ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది. అది కాస్త లెంగ్తీగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అదే కాదు.. సినిమాలో లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ చాలా సన్నివేశాలు కలిగిస్తాయి. దానికి ప్రధాన కారణం దర్శకుడే. తాను ప్రతీ విషయాన్నీ చాలా క్లిస్టర్ క్లియర్‌గా చెప్పాలనుకొంటున్నాడు. డీటైలింగ్ చాలా డిటైల్డ్‌గా ఉంటోంది. అందువల్లే సీన్ లాగ్ అయినట్టు అనిపిస్తోంది. అయితే.. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్, ఎడిటింగ్ టెక్నిక్ ఇవన్నీ ఆ లెంగ్త్ మరీ భారం కాకుండా కాపాడాయి. వేర్వేరు చోట్ల జరిగే విషయాలు ఒకే కట్ లో చూపించడం ‘కేజీఎఫ్’ నుంచి అలవాటైన ఫార్ములా. అది ‘సరిపోదా శనివారం’లోనూ కనిపించింది. దాని వల్ల.. సన్నివేశం కాస్త షార్ప్‌గా చెప్పే అవకాశం లభిస్తోంది. రొమాన్స్, పాటలు.. ఇలాంటివాటికి చోటివ్వకుండా దర్శకుడు కేవలం కథపైనే ఫోకస్ పెట్టడం మరింత నచ్చింది. మొదలు, మలుపు, పీటముడి, ఆట విడుకు, దాగుడు మూతలు అంటూ ఈ సినిమాని దర్శకుడు విభజించుకొంటూ వెళ్లాడు. దాగుడు మూతలు అనే చాప్టర్ మరీ లెంగ్త్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. విలన్ పక్కనే ఉంటూ, హీరో ఓ ఆట ఆడుకోవడం పాత కాన్సెప్టే. దాని కంటే.. వివేక్ ఆత్రేయ కొత్తగా ఆలోచించగలడు. అది చేసి ఉంటే.. తప్పకుండా ‘సరిపోదా శనివారం’ బెంచ్ మార్క్ మూవీగా నిలబడిపోయేది.
ఓ కథని నమ్మితే, దాని కోసం వంద శాతం కష్టపడడానికి నాని ఎప్పుడూ ఆలోచించడు. ఈ కథనీ తాను బలంగా నమ్మాడు. అందుకే సూర్య పాత్రని అవలీలగా, తనదైన శైలిలో మోసుకొంటూ వెళ్లిపోయాడు. నాని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమాలో అది చూసే అవకాశం చాలా తక్కువగా వచ్చింది. కానీ వచ్చిన ప్రతీ సందర్భంలోనూ నాని చక్కగా వాడుకొన్నాడు. ముఖ్యంగా `కల్లు`కి పెళ్లయిపోయిందని ఫీలైన సీన్. దిండులో మొహం దాచేసుకొని నాని ఏడుస్తుంటే చూడ్డానికి చాలా బాగుంది. నాని లాంటి హీరో ఉన్నప్పుడు స్క్రీన్ అంతా తానే కనిపిస్తాడు. కానీ తనని కూడా పక్కకు జరిపి ఆ ప్లేసులోకి దయా వచ్చి నిలబడ్డాడు. సూర్య ఈ సినిమాకు మరో హీరో. తను ఈ పాత్రని బాగా ఓన్ చేసుకొన్నాడు. క్రూరత్వం చూపిస్తూనే కామెడీ చేయడం మామూలు విషయం కాదు. అది సూర్య బాగా పలికించాడు. చారులతగా ప్రియాంక నటన నచ్చుతుంది. తను డీసెంట్ గా కనిపించింది. సాయికుమార్ తన అనుభవాన్ని రంగరించాడు. మురళీ శర్మ పాత్ర కూడా కథకు ఉపయోగపడేలానే రాసుకొన్నాడు దర్శకుడు.
వివేక్ ఆత్రేయలో మంచి రైటర్ ఉన్నాడు. తను దర్శకుడికి బాగా హెల్ప్ అయ్యాడు. సన్నివేశాల్ని రాసుకొన్న విధానం, హీరోయిజాన్ని పండించిన పద్ధతి నచ్చుతాయి. అయితే లెంగ్త్ విషయంలో తనకు జడ్జ్మెంట్ అవసరం. చిన్న చిన్న డైలాగులే, నటీనటుల టైమింగ్ వల్ల బాగా పండాయి. జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణ. పాటలకు స్కోప్ లేకపోయినా, ఆ లోటు నేపథ్య సంగీతంతో తీర్చుకొన్నాడు. చాలా సీన్లు కేవలం జేక్స్ వల్ల ఎలివేట్ అయ్యాయి. ఎడిటింగ్ లో మెరుపులు ఉన్నాయి. అయితే తను ఈ సినిమాని మరింత షార్ప్ చేయాల్సింది. కెమెరా పనితనం, మేకింగ్ క్వాలిటీ ఈ విషయంలో వంక పెట్టడానికి ఏం లేదు. అన్నీ చక్కగా కుదిరాయి.
చాలా రోజుల నుంచి టాలీవుడ్ కు సరైన సినిమా దొరకలేదు. ఈమధ్య వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ‘సరిపోదా శనివారం’ చాలా బెటర్ అవుట్ పుట్ ఇచ్చింది. ఈ వీకెండ్ ఫ్యామిలీ అంతా కలిసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగ్గ సినిమా ఇది. నాని ఫ్యాన్స్‌కి ‘సరిపోదా..’ మరింత బాగా నచ్చే అవకాశం ఉంది.
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్-