ఇండియన్ అమెరికన్ న్యాయ నిపుణురాలు సరిత కోమటిరెడ్డిని ఈస్టర్న్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్ కోర్టుకు న్యాయమూర్తిగా నామినేట్ చేశారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సెనెట్ ఆమోదముద్ర పడిన వెంటనే.. నియామకం అమల్లోకి వస్తుంది. ప్రఖ్యాత హార్వార్డ్ లా స్కూల్లో విద్యనభ్యసించిన సరితా కోమిటిరెడ్డి .. కెలాగ్ హన్సెన్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు పూర్తి చేసుకున్నారు. అనంతరం అమెరికా న్యాయవ్యవస్థలోని వివిధ విభాగాల్లో పనిచేశారు.
సరిత కోమటిరెడ్డి.. కొలంబియా లా స్కూల్లో ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పలువురు న్యాయమూర్తుల వద్ద సహాయకురాలిగా పని చేశారు. 2018-19లో ఇంటర్నేషనల్ నార్కొటిక్స్ అండ్ మనీ లాండరింగ్ , 2016-19 వరకు కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటర్ వ్యవస్థలకు యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ గా వ్యవహరించారు. సరిత కోమటిరెడ్డి నామినేషన్‌ను సెనెట్‌కు ట్రంప్ ఇప్పుడు పంపారు కానీ.. ఫిబ్రవరిలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
సరిత కోమటిరెడ్డి తల్లిదండ్రులు ఇద్దరూ తెలంగాణకు చెందినవారు.. వారు కొన్నేళ్ల కిందట అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సరిత తండ్రి హనుమంత్ రెడ్డి మిస్సౌరీలో కార్డియాలజిస్ట్ ఇక ఆమె తల్లి గీతా రెడ్డి రుమటాలజిస్ట్. భారతీయ ప్రతిభకు అమెరికాలో పట్టం కట్టారని ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.